తెలంగాణ సాయుధ పోరాటంలో చరిత్ర ప్రసిద్ధికెక్కిన బైరాన్‌పల్లి వీరులగాథ ప్రేరణతో ఫిక్షనల్ ఎలిమెంట్స్ జోడించి ‘ఛాంపియన్’ చిత్ర కథరాసుకున్నానని చెప్పారు దర్శకుడు ప్రదీప్ అద్వైతం. రోషన్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ నిర్మించాయి. నేడు విడుదలకానుంది. బుధవారం దర్శకుడు ప్రదీప్ అద్వైతం విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు.
బైరాన్‌పల్లి సంఘటన ఆధారంగా రాసుకున్న కల్పిత కథ ఇది. సికింద్రాబాద్‌కు చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు మైఖేల్‌ను బైరాన్‌పల్లి గ్రామంతో కనెక్ట్ చేస్తూ ఈ ఫిక్షనల్ కథను తయారు చేశా. ఇంగ్లాడ్‌కు వెళ్లాలన్నది మైఖేల్ విలియమ్స్ డ్రీమ్. అందుకోసం అతను ఏం చేశాడు? బైరాన్‌పల్లి పోరులో అతని పాత్ర ఏమిటి? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి.
2019లో ఈ కథ రాసుకొని స్వప్నదత్‌కు చెప్పాను. తనకు బాగా నచ్చింది. అప్పటికీ హీరోగా ఎవరినీ అనుకోలేదు. అదే సమయంలో కరోనా రావడంతో సినిమాకు బ్రేక్‌పడింది. ఇందులో హీరో క్యారెక్టర్ ఆంగ్లో ఇండియన్. అలాంటి ఫీచర్స్ ఉన్న హీరో ఎవరా అని వెతుకుతున్నప్పుడు రోషన్ సరైన ఎంపిక అనిపించింది.
రోషన్ ఈ సినిమా కోసం మూడేళ్లు ప్రిపేర్ అయ్యాడు. ఇతర సినిమా అవకాశాలు వచ్చినా వద్దనుకున్నాడు. తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. మైఖేల్ పాత్రను ప్రేక్షకులు అస్సలు మరచిపోలేరు. అంత ప్రభావవంతంగా ఉంటుంది. మూడేళ్ల నిరీక్షణకు రోషన్ తగిన ఫలితాన్ని అందుకుంటాడనే నమ్మకం ఉంది. నందమూరి కల్యాణ్‌చక్రవర్తి, అర్చన పాత్రలు కథాగమనంలో కీలంగా ఉంటాయి.
సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ తన కెరీర్లో నిలిచిపోయేలా ఉత్తమ పాటల్ని అందించారు. పాటలకు అద్భుతమైన స్పందన వస్తున్నది. కళా దర్శకుడు తోట తరణి, ఛాయాగ్రాహకుడు మది వంటి అత్యుత్తమ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా.
తెలంగాణ సాయుధ పోరాటం ఆధారంగా ఇప్పటికే కొన్ని సినిమాలొచ్చాయి. అయితే ఇందులో ఓ చారిత్రక ఘటనను నేటి తరానికి సినిమాటిక్ పంథాలో చెప్పే ప్రయత్నం చేశా. సినిమా చూశాక ఆనాటి పరిస్థితుల గురించి ప్రేక్షకులు తెలుసుకుంటే మా ప్రయత్నం సఫలమైనట్లే.
తెలంగాణ గడ్డపై తెలియని ఎన్నో కథలున్నాయి. మన చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా ద్వారా అలాంటి మూల కథని నేటి తరానికి తెలియజెప్పే ప్రయత్నం చేశాం. సినిమా చూస్తున్న ప్రేక్షకులు చరిత్రలో లీనమైపోతారు. తెరపై పాత్రలతో సహానుభూతి చెందుతారు. దర్శకుడిగా నేను డ్రామాను బాగా హ్యాండిల్ చేయగలను. ఎలాంటి కథ రాసుకున్నా అందులో సంఘర్షణ బలంగా ఉండేలా చూసుకుంటాను.