The Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి కీలక అప్డేట్ ఒకటి టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నది. వాస్తవానికి ఈ ది రాజా సాబ్ మూవీని ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తున్నది. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న వ్యక్తి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. కల్కి ఏడీ 2898 ఏడీ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రంపై భారీగానే అంచనాలున్నాయి. ది రాజా సాబ్ సినిమా వాయిదా పడిందన్న సమాచారంతో ప్రభాస్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
ప్రస్తుతం, మూవీని రిలీజ్ వాయిదాపడిందని.. త్వరలోనే కొత్త తేదీని ప్రకటించనున్నట్లు సదరు వ్యక్తి తెలిపారు. రిలీజ్ వాయిదాకు కారణాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. అయితే, సంక్రాంతి సందర్భంగా మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ని రిలీజ్ కానుందని పేర్కొన్నారు. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తుండగా.. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మాళవికా మోహనన్‌కు తెలుగులో ఇదే తొలి చిత్రం కావడం విశేషం. రాజా సాబ్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.