ప్రభాస్ పెళ్లెప్పుడు? అభిమానులకు ఇదొక మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆ శుభవార్త విని ఆనందిద్దామని ఆయన ఫ్యాన్స్ కొన్నేళ్లుగా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్న ప్రభాస్‌కు ఇదే ప్రశ్న ఎదురుకాగా.. ‘సల్మాన్‌ఖాన్ నాకు స్ఫూర్తి. ఆయన పెళ్లి తర్వాతే నా పెళ్లి.’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు. తాజాగా ఓ టీవీ ఛానల్ షోలో పాల్గొన్న ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. ఇదే వేదికలో సీతారామశాస్త్రి రాసిన పెళ్లి పాటల గురించి ప్రస్తావించారు. “మనీ’ సినిమాలో ‘భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ..’ రాసింది సీతారామశాస్త్రిగారే. ఆ పాటలో పెళ్లొద్దని చెప్పారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో పెళ్లి గొప్పతనాన్ని వర్ణిస్తూ అద్బుతమైన పాటలు రాశారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా? వద్దా?’ అంటూ నవ్వుతూ ప్రశ్నించారు. ‘చక్రం’ సినిమాలోని ‘జగమంత కుటుంబం’ పాట తెలుగు సినీచరిత్రలో ఓ గొప్ప పాట అని, ఆ పాటలోని సాహిత్యం తెలుసుకొని ఆశ్చర్యపోయానని ప్రభాస్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్’ ‘సలార్-2’ ‘స్పిరిట్’ ‘ఫౌజీ’ ‘కల్కి 2’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.