అగ్ర హీరోలు తమ సినిమా షూట్ టైమ్‌లోనే అదే దర్శకుడితో మరో సినిమా చేయడానికి ఆసక్తిని చూపించడం, ఆఫర్ అందించడం ఈరోజుల్లో అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రభాస్ అలాంటి ఆఫర్‌నే దర్శకుడు హను రాఘవపూడికి ఇచ్చారని అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రభాస్‌తో హను రాఘవపూడి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దీనికి ‘ఫౌజీ’ అనే పేరు పరిశీలనలో ఉంది. స్వాతంత్య్ర సంగ్రామం నాటి ఈ కథలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనపించనున్నారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ హను రాఘవపూడి వర్కింగ్ ైస్టెల్ ప్రభాస్‌కు బాగా నచ్చిందట. అతని విజన్, మేకింగ్‌లోని ఈస్థటిక్ సెన్స్‌తో బాగా ఇంప్రెస్ అయ్యాడట. దీంతో ‘ఫౌజీ’ పూర్తికాకముందే హను రాఘవూడితో మరో సినిమా చేస్తానని ఆఫర్ ఇచ్చాడట.
అంతేకాదు ఓ అగ్ర నిర్మాణ సంస్థతో అడ్వాన్స్ కూడా ఇప్పించాడని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నది. స్వయంగా ప్రభాసే ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ఇన్సైడ్ టాక్. అయితే ఈ సినిమా పట్టాలెక్కడం మాత్రం ఇప్పట్లో జరిగే పని కాదు. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’ ‘ది రాజాసాబ్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇవి పూర్తిచేసిన తర్వాత ‘స్పిరిట్’ ‘సలార్-2’ ‘కల్కి2’, ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో ‘బ్రహ్మరాక్షస్’ వంటి సినిమాలు చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయితే కానీ హను రాఘవపూడితో రెండో సినిమా పట్టాలెక్కే పరిస్థితి లేదు.