భారతీయ పౌరాణిక ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ప్రభాస్ టైటిల్ రోల్‌ను పోషిస్తున్నారు. సీత పాత్రలో కృతిసనన్ నటిస్తున్నది. పాన్ ఇండియా స్థాయిలో జూన్ 16న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘మంత్రం కంటే గొప్పది నీ నామం’ అనే క్యాప్షన్‌తో విడుదలైన ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటున్నది.
శ్రీరామనవమి రోజున మాతా వైష్ణోదేవీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చిత్రబృందం అక్కడి నుంచి ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ సినిమాలో ప్రతినాయకుడు లంకేశ్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్అలీఖాన్ కనిపించనున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.