ప్రభాస్ నటిస్తున్న ఇతిహాసిక చిత్రం ‘ఆదిపురుష్’. టీ సిరీస్ సంస్థలో భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఓం రావత్ దర్శకుడు. కృతి సనన్ నాయికగా నటిస్తున్నది. రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాఘవ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ సినిమాలో భారీ విజువల్ ఎఫెక్టులు ఉపయోగిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం త్రీడీ ఫార్మేట్ పనులు జరుపుకుంటున్నది.
వచ్చే ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12న విడుదల చేయబోతున్నారు. తాజా సమాచారం మేరకు ఈ చిత్ర తెలుగు ప్రదర్శన హక్కులను యూవీ క్రియేషన్స్ సంస్థ పొందిందట. ఇందుకు భారీ మొత్తాన్ని ఈ సంస్థ చెల్లించినట్లు తెలుస్తున్నది. యూవీ క్రియేషన్స్ ప్రభాస్ సొంత సంస్థే కాబట్టి ఈ చిత్రాన్ని తెలుగులో ఆయన రిలీజ్ చేస్తున్నట్లే అనుకోవచ్చు. తన కెరీర్లో ప్రతిష్టాత్మక చిత్రం కాబట్టి ప్రభాస్ సినిమా విడుదల విషయంలోనూ జాగ్రత్తపడినట్లు తెలుస్తున్నది.