ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఓ అరడజను పానిండియా సినిమాలున్నాయి. వాటిలో మొదట విడుదలయ్యే సినిమా ‘ది రాజాసాబ్’. జనవరి 9న సంక్రాంతి కానుకగా ఆ సినిమా విడుదల కానున్నది. ఈ లైనప్‌లో రెండో సినిమా ‘ఫౌజీ’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగభాగం పూర్తయిందని సమాచారం. దేశభక్తి అంశాలతో నిండిన ఈ ప్రేమకథను వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలావుంటే.. ‘ఫౌజీ’ సినిమాకు చెందిన ఓ కొత్త సమాచారాన్ని చిత్ర దర్శకుడు హను రాఘవపూడి రీసెంట్గా వెల్లడించారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
ఈ సెకండ్ పార్ట్.. తొలి భాగానికి ప్రీక్వెల్‌గా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ రెండు భాగాల్లోని ప్రభాస్ పాత్రల గురించి హను రాఘవపూడి చెబుతూ – ‘తొలి పార్ట్‌లోని పాత్రకు పూర్తి భిన్నంగా మలి భాగంలోని పాత్ర ఉంటుంది. వలస పాలన నేపథ్యంలో ఈ ప్రీక్వెల్ రూపొందించనున్నాం. పర్సనల్‌గా నన్ను ఇన్స్పైర్ చేసిన కొన్ని రియల్ లైఫ్ అనుభవాలు ఇందులో ఉంటాయి.’ అన్నారు. ప్రభాస్ సైనికుడిగా నటిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో ఇమాన్వి కథానాయిక. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్‌ఖేర్, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రధారులు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.