Prabhas | పౌరాణిక పాత్రలకు సరిగ్గా సరిపోయే ఫిజిక్ ప్రభాస్ది. ఇప్పటికే ‘అదిపురుష్’లో రాముడిగా, ‘కల్కి 2898’లో కర్ణుడిగా కనిపించి ప్రేక్షకులను అలరించారాయన. త్వరలో రానున్న ‘కన్నప్ప’లో నందీశ్వరుడిగా కనిపిస్తారని టాక్ వినిపిస్తున్నది. ఇదిలావుంటే.. బీటౌన్‌లో ప్రభాస్‌కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త బలంగా వినిస్తున్నది. ప్రభాస్ మళ్లీ రామాయణ కథలో నటించనున్నారట. వివరాల్లోకెళ్తే.. ప్రస్తుతం దర్శకుడు నితీశ్ తివారి ‘రామాయణం’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
అందులో రాముడిగా రణబీర్‌కపూర్ నటిస్తుండగా, సీతగా సాయిపల్లవి కనిపించనుంది. ఈ సినిమాలో సీతారాముల కల్యాణఘట్టాన్ని కన్నుల పండువగా తీయాలనే తలంపుతో ఉన్నారట నితీష్ తివారి. ఈ ఘట్టంలో పరశురాముడి పాత్ర చాలా కీలకం. ఆ పాత్రకోసం ప్రభాస్‌ని కలిశారట నితీశ్ తివారి. విష్ణుమూర్తి దశావాతారాల్లో రామావతారానికి ముందు వచ్చే అవతారం పరశురామావతారం. రాముడిగా రణబీర్‌కపూర్ చేస్తున్నప్పుడు, పరశురాముడిగా కూడా ఆ స్థాయి హీరో చేస్తే సబబుగా ఉంటుందని నితీశ్ భావించారట. దాంతో ఆయన ప్రభాస్‌ని కలిశారట. ప్రభాస్ కూడా పరశురాముడిగా నటించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన నిజానిజాలు ఇంకొన్ని రోజుల్లో వెల్లడి కానున్నాయి.