క్రేజీ కాంబినేషన్‌కు టాలీవుడ్ తెరలేపింది. ప్రభాస్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో సినిమా రూపొందనున్నట్టు విశ్వసనీయ సమాచారం. నిజంగానే ఇది క్రేజీ కాంబో. ప్రస్తుతం ప్రభాస్ అంటే పానిండియా సూపర్‌స్టార్. ఇక ‘పుష్ప2’తో దేశవ్యాప్తం సుకుమార్ చేసిన హంగామా తెలిసిందే. వీరిద్దరూ కలిస్తే పానిండియా ప్రకంపనలు ఖాయం. నిజానికి ఈ కాంబో గురించి ఎప్పట్నుంచో లీకులందుతున్నాయి.
అటు ప్రభాస్, ఇటు సుకుమార్ వారివారి సినిమాలతో బిజీగా ఉండటం చేత ఇవన్నీ గాలివార్తలే అని కొట్టిపారేశారంతా. కానీ ఇప్పుడు ఈ కాంబినేషన్ ఖాయమేనని ఫిల్మ్ వర్గాల టాక్. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. సుకుమార్ ప్రస్తుతం రామ్‌చరణ్ సినిమా స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయ్యాక ఆయన ‘పుష్ప 3’ చేస్తారని అంతా అనుకున్నారు.
అయితే.. ప్రస్తుతానికి ‘పుష్ప 3’ని పక్కనపెట్టి ప్రభాస్ సినిమా చేయాలని సుకుమార్ ఫిక్సయ్యారట. మరోవైపు ప్రభాస్ కూడా ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగుల్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత స్పిరిట్, సలార్, కల్కి2 ఎలాగూ ఉన్నాయి. వీటన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి, సుకుమార్ సినిమా మొదలుపెడతారని ఇన్సైడ్ టాక్. మరి ఈ వార్తలో నిజం ఎంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.