‘ఓ సెలబ్రేషన్‌లా సినిమా రిలీజ్ కావడం చాలా అరుదు. ‘ఓజీ’ విషయంలో అది జరిగింది. అలాంటి అవకాశం ఇచ్చినందుకు ప్రేక్షకులందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సినిమా హీలింగ్ ఆర్ట్. అభిప్రాయభేదాలున్న వ్యక్తుల్ని కూడా కలుపుతుంది. మనలో సమైక్యతను పెంచే గొప్ప కళ సినిమా’ అన్నారు అగ్ర హీరో పవన్‌కల్యాణ్. ఆయన కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఓజీ’ చిత్రం ఇటీవలే విడుదలై విజయపథంలో పయనిస్తున్నది.
ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ ఈవెంట్‌ను నిర్వహించారు. పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ ‘ ఈరోజు నన్ను డిప్యూటీ సీఎం హోదాలో కూర్చొబెట్టింది సినిమానే. సినిమా నాకు అన్నంపెట్టిన తల్లి. సమాజంలోని అసమానతలపై పోరాడటానికి సినిమా ఉపకరించింది. నేను పదవి కోసం ఎప్పుడూ తపించలేదు. అలాగే ఫెయిల్యూర్స్‌కి ఎప్పుడూ భయపడలేదు. ఏ సినిమాకైనా ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా.
టీమ్ వర్క్ లేకనే నేను చాలా చాలాసార్లు ఫెయిల్ అయ్యా. కానీ ‘ఓజీ’ సినిమాకు మంచి టీమ్ దొరికింది. తమన్ అత్యద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ‘ఓజీ’కి ఓ డిఫరెంట్ నరేటివ్ ైస్టెల్‌ని తీసుకురావడంలో దర్శకుడు సుజిత్ వందశాతం ఎఫర్ట్స్ పెట్టాడు. జెన్ జీ డైరెక్టర్ సుజిత్. ఈ సినిమాకు ప్రీక్వెల్ లేదా సీక్వెల్ కోసం పనిచేద్దామని సుజిత్‌కు మాటిచ్చాను’ అన్నారు. డీవీవీ దానయ్య మాట్లాడుతూ ‘త్రివిక్రమ్ ప్రోత్సాహం వల్లే ఈ సినిమా చేయగలిగాను. పవన్‌కల్యాణ్ ఈ సినిమాలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచారు. ఈ చిత్రానికి భారీ విజయాన్నందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అన్నారు.