‘పొట్టేల్’ సినిమా అంతా రా అండ్ రస్టిక్‌గా ఉంటుందని, కథానుగుణంగా మంచి మ్యూజిక్ కుదిరిందని చెప్పారు చిత్ర సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర. యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో రూపొందిన ‘పొట్టేల్’ చిత్రం ఈ నెల 25న విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర మాట్లాడుతూ ‘ఈ కథ విన్నప్పుడు షాక్ అయ్యాను. ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లొచ్చాయి. పిల్లల చదువు కోసం పేరెంట్స్ ఎంత కష్టపడతారో అనే అంశాన్ని ఈ సినిమాలో హృద్యంగా చూపించారు. గ్రామీణ నేపథ్యంలో ఈ కథ మనసుకు హత్తుకునేలా ఉంటుంది’ అన్నారు. ఈ సినిమాలో ప్రతీ సన్నివేశం చాలా సహజంగా ఉంటుందని, అందుకు తగినట్లుగానే మ్యూజిక్ అందించానని, కాసర్ల శ్యామ్ అర్థవంతమైన సాహిత్యాన్ని అందించారని ఆయన తెలిపారు. ‘ ఇందులో మొత్త నాలుగు పాటలుంటాయి. ప్రతీ పాట కథలోని సారాన్ని తెలియజెప్పేలా ఉంటుంది’ అని శేఖర్‌చంద్ర పేర్కొన్నారు.