డబ్బు, పేరు ప్రఖ్యాతుల కోసం ఆలోచిస్తూ తానెప్పుడూ సినిమాలు చేయనని అంటోంది పూర్ణ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అఖండ’. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకురానున్నది. సోమవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో పూర్ణ ముచ్చటిస్తూ ‘ఈ సినిమాలో పద్మావతి అనే హెల్త్ మినిస్టర్‌గా నేను కనిపిస్తా. ఆధిపత్య ధోరణితో కూడిన మహిళగా నా పాత్రను శక్తివంతంగా తీర్చిదిద్దారు. హీరో, విలన్ మధ్య వైరానికి కారణమయ్యే క్యారెక్టర్ నాది. నిడివి తక్కువే అయినా కథలో కీలకంగా ఉంటుంది. బాలకృష్ణ క్రమశిక్షణ, ఎనర్జీ అద్భుతం. 2008లో టాలీవుడ్‌కు పరిచయమయ్యా. ఇన్నాళ్లు అగ్రహీరోల సినిమాల్లో నటించలేదనే వెలితి ఉండేది. ఆ కల ఈ సినిమా ద్వారా తీరింది. మిస్కిన్ దర్శకత్వంలో రూపొందిన ‘సవరకత్తి’ తర్వాత హీరోయిన్ పాత్రలకు పరిమితం కాకుండా కథలో ప్రాధాన్యమున్న మంచి క్యారెక్టర్స్ చేయాలని నిర్ణయించుకున్నా. డబ్బు గురించి ఆలోచించకుండా ప్రతిభను నమ్ముకుంటేనే సుదీర్ఘకాలం పాటు ఇండస్ట్రీలో ఉండగలమని నమ్ముతా. ఆ సిద్ధాంతాన్నే అనుసరిస్తున్నా. తెరపై గ్లామరస్‌గా కనిపించినా అది కథకు తగినట్లుగానే ఉండాలని విశ్వసిస్తా. సినిమాలు, పాత్రల ఎంపికలో నేను కొన్ని తప్పులు చేశా. ఆ పొరపాట్ల నుంచి నేర్చుకున్న పాఠాలతో కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నా. సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు చేస్తున్నా’ అని తెలిపింది.