Pooja Hegde | మంగళూరు భామ పూజా హెగ్డే ఇటీవలకాలంలో రేసులో కాస్త వెనకబడింది. వరుస ఫ్లాపులు ఆమెను నిరుత్సాహానికి గురిచేశాయి. అయినా ఏమాత్రం అధైర్యపడకుండా కెరీర్లో భారీ విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్నది. తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ చిత్రంలో ఈ భామ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా తన కెరీర్ను మలుపుతిప్పుతుందనే ఆశాభావంతో ఉంది పూజాహేగ్డే.
గతంలో భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసే ఆమె ప్రస్తుతం పట్టువిడుపులు ప్రదర్శిస్తున్నదట. దళపతి విజయ్ సినిమాకు తక్కువ పారితోషికం తీసుకుందని తెలిపింది. ప్రస్తుతం పూజాహెగ్డేకు తమిళం, హిందీల్లో అవకాశాలు బాగానే వస్తున్నా.. తెలుగులో మాత్రం ఇప్పటివరకు కొత్త సినిమా సైన్ చేయలేదు. తమిళంలో సూర్య 44 చిత్రంలో కూడా ఈ భామనే కథానాయికగా ఖరారైంది. ఈ రెండు చిత్రాలు తనకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తాయని, తెలుగులో కూడా త్వరలో మంచి అవకాశాలు వరిస్తాయని నమ్మకంతో ఉంది పూజాహెగ్డే.