ఫ్లాప్స్ పూజా హెగ్డే (Pooja Hegde)కు కొత్త కాదు. అసలు తన కెరీర్ మొదలైందే భారీ ఫ్లాప్ చిత్రంతో. ఇటీవల ఆమె సక్సెస్ జోరు తగ్గినా అది ఆఫర్స్‌పై ఏమాత్రం ప్రభావం చూపించడం లేదు. తెలుగుతోపాటు తమిళం, హిందీలో స్టార్ హీరోలతో నటిస్తున్నదీ నాయిక. అవకాశాల వరకు తన క్రేజ్ పనికొచ్చినా సక్సెస్ కూడా ఇక్కడ చాలా ముఖ్యమని ఆమెకు తెలుసు. అందుకే ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ‘సర్కస్’ (Cirkus)పై పూజా చాలా ఆశలు పెట్టుకుంది.
రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందిస్తున్నారు. కంప్లీట్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా తనకు నాయికగా భారీ హిట్ ఇస్తుందని ఆశిస్తున్నదీ భామ. ఈ సినిమాకు విజయం దక్కితే మరికొంత కాలం బాలీవుడ్లో తన జెండా ఎగరేయవచ్చన్నది పూజా ఆలోచన. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది. ఈ నెల 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్దమవుతున్నది.
ఇక ప్రారంభం నుంచి పూజా హెగ్డే కెరీర్ సర్ప్రైజింగ్గా సాగుతున్నది. బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఎంట్రీ ఇచ్చిన హిస్టరీ ఆమెది. హృతిక్ రోషన్‌తో తన తొలి హిందీ సినిమా ‘మొహంజొదారో’లో నటించిందీ భామ. ఆ సినిమా అపజయం పాలవడంతో దక్షిణాది వైపు దృష్టి సారించింది. ఇక్కడ ‘డీజే’, ‘మహర్షి’, ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రాలు పూజా హెగ్డేకు స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఈ సుందరి తెలుగులో మహేష్ సరసన ‘ఎస్ఎస్ఎంబీ 28’ సినిమాతో హిందీలో సల్మాన్‌తో ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రాల్లో నటిస్తున్నది.