గత కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నది మంగళూరు సోయగం పూజాహెగ్డే. బాలీవుడ్లో వరుస పరాజయాలు పలకరించడంతో ప్రస్తుతం ఈ భామ తమిళ సినిమాపై దృష్టిపెడుతున్నది. అక్కడ సూర్య ‘రెట్రో’, దళపతి విజయ్ ‘జన నాయగన్’ సినిమాలతో పాటు రాఘవ లారెన్స్ హారర్ చిత్రం ‘కాంచన-4’లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నది. ఈ మూడు సినిమాలతో తిరిగి దక్షిణాదిన పూర్వవైభవం సాధిస్తాననే విశ్వాసంతో ఉంది.
ఈ నేపథ్యంలో ‘కాంచన-4’లో పూజాహెగ్డే పాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నది. కెరీర్లోనే ఆమెకిది సవాలుతో కూడుకున్న పాత్ర అని చెబుతున్నారు. ఇందులో పూజాహెగ్డే మూగ మరియు చెవిటి అమ్మాయి పాత్రలో కనిపిస్తుందని సమాచారం. ఇప్పటివరకు కెరీర్లో ఎక్కువగా గ్లామర్ నాయికగానే పేరు తెచ్చుకున్న పూజాహెగ్డే ఈ సినిమాలోని పాత్ర ద్వారా సరికొత్త ఇమేజ్ను సంపాదించుకుంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. నటిగా తన జాతకాన్ని మార్చే చిత్రమిదని పూజాహెగ్డే సైతం తన సన్నిహితుల దగ్గర చెబుతున్నదట. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ‘కాంచన-4’ ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.