Pongal Movies | టాలీవుడ్‌కు సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు… బాక్సాఫీస్‌కు అసలైన పరీక్ష. కుటుంబ ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చే ఈ సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి స్టార్ హీరోల సినిమాలు పోటీగా విడుదలవుతుంటాయి. భారీ బిజినెస్, గ్రాండ్ ప్రమోషన్స్, రికార్డు అంచనాలతో వచ్చే ఈ సినిమాలు సాధారణంగా వసూళ్ల పండుగ జరుపుతాయని భావిస్తారు. కానీ ఇటీవలి సంవత్సరాల్లో సంక్రాంతికి మొదటగా విడుదలైన కొన్ని స్టార్ హీరోల సినిమాలు ఆశించిన స్థాయిలో రిజల్ట్ ఇవ్వకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ ట్రెండ్ గమనిస్తే 2018 సంక్రాంతి గుర్తుకు వస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి భారీ హైప్‌తో రిలీజ్ అయినప్పటికీ, మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ ఎదుర్కొంది. త్రివిక్రమ్ – పవన్ కాంబినేషన్‌పై ఉన్న అంచనాలు నెరవేరకపోవడంతో కథ, స్క్రీన్‌ప్లే విషయంలో విమర్శలు వచ్చాయి. ఆ ప్రభావం సినిమాపై స్పష్టంగా పడింది.
అదే తరహాలో 2024 సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం బరిలోకి దిగింది. మాస్ ఎంటర్టైనర్గా, భారీ బిజినెస్‌తో వచ్చిన ఈ మూవీపై అభిమానులు పెద్ద ఆశలే పెట్టుకున్నారు. కానీ విడుదల తర్వాత కథా ప్రవాహం, టోన్ విషయంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమందికి నచ్చినా, మొత్తం మీద సినిమా మిక్స్డ్ టాక్కే పరిమితమైంది.
2025 సంక్రాంతి వచ్చేసరికి రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్‌పై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంపై భారీ హైప్ ఉన్నప్పటికీ, విడుదలైన తర్వాత కథలో స్పష్టత లోపించడం, రన్‌టైమ్ ఎక్కువగా ఉండటం వంటి అంశాలు విమర్శలకు దారితీశాయి. అంచనాలు ఉన్నా, ఫలితం మాత్రం అంత స్థాయిలో రాలేదు.
ఇక తాజాగా 2026 సంక్రాంతికి ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ థియేటర్లలోకి వచ్చింది. డార్లింగ్ నుంచి ఒక ఫుల్ ఎంటర్టైనర్ కోసం ఎదురు చూసిన అభిమానులు సినిమా చూసి సంతృప్తి వ్యక్తం చేసినా, అన్ని వర్గాల ప్రేక్షకులను అది పూర్తిగా మెప్పించలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. హారర్ కామెడీ అంశాలు కొందరికి నచ్చినా, కొందరికి మాత్రం కనెక్ట్ కాలేదని అంటున్నారు.
ఇలా వరుసగా నాలుగు సంవత్సరాల్లో సంక్రాంతికి ముందుగా వచ్చిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ సినిమాలు మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే దీన్ని సంక్రాంతి సెంటిమెంట్‌తో ముడిపెట్టడం కంటే, ప్రతి సినిమాకూ కంటెంటే ఫైనల్ జడ్జ్ అనే వాస్తవాన్ని గుర్తు చేస్తోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కథ బలంగా ఉంటే ఏ సీజన్ అయినా బాక్సాఫీస్‌లో విజయం సాధిస్తుందన్నది మరోసారి రుజువవుతోందని చెప్పొచ్చు.