‘అదిపురుష్’ టీజర్ ఏ ముహూర్తానా రిలీజ్ చేసారో కానీ, అప్పటి నుండి సినిమాపై వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. గతేడాది దసరా కానుకగా రిలీజైన టీజర్‌పై ప్రేక్షకులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. రాముడు, హనుమంతుడు తోలుతో చేసిన దుస్తులు ధరించారని, రావణుడిని చూపించిన విధానం సరిగా లేదని పలు విధాలుగా విమర్శలు చేశారు. అంతేకాకుండా సినిమా విడుదలపై స్టే విధించాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్లు దాఖలైంది. ఇన్నీ విమర్శల మధ్య ఆది పురుష్ బృందం వెనక్కు తగ్గి వీఎఫ్ఎక్స్ను మెరుగు పరచడం కోసం ఏకంగా ఆరు నెలలు సినిమాను పోస్ట్ పోన్ చేశారు.
ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనులు జరుపుకుంటున్న ఆదిపురుష్ సినిమాపై తాజాగా మరో వివాదం వెలుగులోకి వచ్చింది. కుల్దీప్ అనే వ్యక్తి ఆదిపురుష్ టీజర్‌పై అలహాబాద్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. సెన్సార్ బోర్డు నుండి సర్టిఫికేట్ రాకుండానే టీజర్‌ను విడుదల చేశారని పిటీషన్లో పేర్కొన్నాడు. సీతాదేవి పాత్రలో నటిస్తున్న కృతిసనన్ ధరించిన దుస్తులపై కూడా అభ్యంతరాలు తెలిపాడు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సెన్సార్ బోర్డ్‌కు నోటీసులిచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ, తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది.
ఇలా ఆది నుండి ఆదిపురుష్‌కు దెబ్బలు తగులుతున్నాయి. ఓంరౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా కృతిసనన్ నటించింది. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. అన్ని సవ్యంగా జరిగితే ఆదిపురుష్ సినిమా రిలీజై ఇప్పటికే రెండు రోజులు అయ్యుండేది. టీజర్‌కు మిశ్రమ స్పందన రావడంతో మేకర్స్ వీఎఫ్ఎక్స్ కోసం మరో వంద కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను జూన్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించినా.. వీఎఫ్ఎక్స్ పని అప్పటివరకు పూర్తి కాదని టక్. ఇక ఈ సినిమా కోసం మరో ఏడాది వేచి చూడాల్సిందే అని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.