Peddi | రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం.. అమెరికాలో మాత్రం జూన్ 3 నుంచే ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. నార్త్ అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ అయిన కొన్ని గంటల్లోనే లక్ష డాలర్లకు పైగా ప్రీసేల్స్ నమోదైనట్లు చిత్ర బృందం ప్రకటించింది. 5000కి పైగా టికెట్లు అమ్ముడయ్యాయని, ఇది కేవలం ఆరంభమేనని పేర్కొంది.అయితే ఇప్పుడు ‘పెద్ది’ సినిమాకి సంబంధించిన టికెట్ రేట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. యూఎస్‌లో కొన్ని థియేటర్లలో ఒక్క టికెట్ ధర ట్యాక్స్‌తో కలిపి $40 నుంచి $42 వరకు వెళ్తోందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
దీనిపై ఓ తెలుగు సినీ అభిమాని వీడియో రూపంలో తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇది ‘ఆర్ఆర్ఆర్’నా? ‘బాహుబలి’నా? అంత భారీ స్కేల్ సినిమా కాకపోయినా టికెట్ ధరలు మాత్రం మాగ్నమ్ ఓపస్ రేంజ్లో ఉన్నాయి” అంటూ ప్రశ్నించాడు. హిందీ పెద్ద సినిమాలకే $15 నుంచి $20 మధ్యలో టికెట్లు పెడుతున్నారు. కానీ ‘పెద్ది’కి మాత్రం $38 ప్లస్ ట్యాక్స్ అంటే సాధారణ ప్రేక్షకుడిపై భారం పడుతుంది. సినిమా బాగుంటుందని నమ్మకం ఉంది. నేను కూడా ఫస్ట్ డే చూస్తాను. కానీ ఈ స్థాయి ధరలు ఎందుకు?” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ విమర్శలపై ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ స్పందించింది. స్టాండర్డ్ 2D టికెట్ ధరలు సాధారణంగా $20-$25 మధ్య ఉంటాయని, అయితే PLF, D-BOX వంటి స్పెషల్ ఫార్మాట్స్ కారణంగా అదనంగా $5 నుంచి $10 వరకు పెరుగుతాయని వివరించింది. ట్యాక్స్‌లు, ఆన్లైన్ బుకింగ్ ఛార్జీలు కూడా రాష్ట్రాలవారీగా మారుతాయని తెలిపింది.
అధికారిక ప్రకటన ప్రకారం.. జూన్ 3 తెలుగు ప్రీమియర్స్‌కు స్టాండర్డ్ 2D టికెట్ ధర $25/$20గా నిర్ణయించగా, స్పెషల్ ఫార్మాట్స్‌తో కలిపి మొత్తం ధర $40 దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫస్ట్ వీక్‌లో కూడా టికెట్ ధరలు సాధారణ సినిమాలతో పోలిస్తే ఎక్కువగానే ఉండనున్నాయి. ఇదిలా ఉంటే, భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలకు కూడా ఇంత రేట్లు పెట్టని సమయంలో ‘పెద్ది’ టికెట్ ధరలు ఈ స్థాయిలో ఉండటంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు అభిమానులు మాత్రం “హైప్ ఉన్న సినిమాలకు ఓపెనింగ్ డే క్రేజ్ సహజం” అంటూ సమర్థిస్తున్నారు.