రామ్‌చరణ్ నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబధించిన తాజా అప్డేట్ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఇప్పటికే యాభైశాతం చిత్రీకరణ పూర్తయిందని, మరోవైపు షూటింగ్‌కు సమాంతరంగా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాల్ని కూడా జరుపుతున్నామని తెలిపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘పెద్ది’ చిత్రాన్ని గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలిసింది. ప్రపంచంలోని వివిధ దేశాలు, భాషల్లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట.
ఆ దిశగా వరల్డ్‌వైడ్ ప్రమోషన్స్‌కు కూడా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ ఆటకూలీగా కనిపించనున్నారు. ఏ ఆటనైనా ఆడగలిగే సామర్థ్యం ఉన్న యువకుడిగా ఆయన పాత్ర వినూత్న రీతిలో సాగుతుందని, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. జాన్వీకపూర్, శివరాజ్‌కుమార్, జగపతిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, రచన-దర్శకత్వం: బుచ్చిబాబు సానా.