‘రజనీకాంత్ శైలి యాక్షన్, ఎంటర్టైన్మెంట్ హంగులున్న చిత్రమిది. వింటేజ్ రజనీకాంత్‌ను ఈ సినిమాలో చూస్తారు’ అని అన్నారు సురేష్‌బాబు. నారాయణ్‌దాస్ నారంగ్, దిల్‌రాజులతో కలిసి ఆయన తెలుగులో విడుదలచేస్తున్న చిత్రం ‘పెద్దన్న’. రజనీకాంత్, నయనతార జంటగా నటించారు. శివ దర్శకుడు. ఈ నెల 4న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నారాయణ్‌దాస్ నారంగ్ మాట్లాడుతూ ‘మాపై నమ్మకంతో సినిమాను తెలుగులో విడుదల చేసే అవకాశాన్ని ఇచ్చిన రజనీకాంత్‌తో పాటు దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు చెబుతున్నా. దీపావళికి చక్కటి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అని అన్నారు. సురేష్‌బాబు మాట్లాడుతూ ‘లాక్డౌన్ అనంతరం థియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇలాంటి తరుణంలో ఓ పెద్ద సినిమాను విడుదలచేస్తే బాగుంటుందనే ఆలోచనతో ‘అన్నాత్తే’ తెలుగు హక్కులను తీసుకున్నాం. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. రజనీకాంత్ సోదరిగా కీర్తిసురేష్ నటించింది. అన్ని రకాల ఎమోషన్స్‌తో చక్కటి విందుభోజనంలా ఉంటుంది. క్లాస్, మాస్ అనే భేదాలు లేకుండా అందరిని అలరిస్తుంది. భవిష్యత్తులో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు లేకుండా మంచి కథలు లభిస్తే ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంలో మరిన్ని చిత్రాల్ని నిర్మిస్తా’ అని తెలిపారు.