Peddakapu-1 Movie | కుటుంబ కథా నేపథ్యంలో సినిమాలు తీయడంలో శ్రీకాంత్ అడ్డాల దిట్ట. మహేష్, వెంకటేశ్‌లను పెట్టి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే క్లాస్సీ మల్టీస్టారర్ తీసి మాస్ ఆడియెన్స్‌తో చప్పట్టు కొట్టించుకున్న ఘనత శ్రీకాంత్ అడ్డాలకే చెందింది. అలాంటి దర్శకుడు రెండేళ్ల కిందట వెంకటేష్‌తో నారప్ప వంటి సినిమా తీసి మాస్ సబ్జెక్ట్‌ను కూడా డీల్ చేయడంలోనూ దిట్ట అని నిరూపించుకున్నాడు. పేరుకు రీమేక్ సినిమానే అయినా.. ఒరిజినల్ సోల్ మిస్సవ్వకుండా శ్రీకాంత్ తన టేకింగ్‌తో కథను నడిపిన తీరుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ దర్శకుడు ప్రముఖ నిర్మాత మిర్యాల రవిందర్ రెడ్డిని హీరోగా పెట్టి పెద కాపు అనే ఓ అవుట్ అండ్ అవుట్ రా, రస్టిక్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా టైటిల్ పోస్టర్ నుంచి మొన్న రిలీజైన గ్లింప్స్ వరకు ప్రతీది అంతకంతకూ అంచనాలు పెంచుతూనే వచ్చాయి. ఓ సామాన్యుడు సంతకం అంటూ మేకర్స్ సినిమాను ప్రమోట్ చేస్తూ జనాల్లో ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కులాల ఆదిపత్యాలు, రాజకీయాలు, వర్గ పోరాటాల చుట్టూ ఈ కథ జరగనున్నట్లు ట్రైలర్‌తో క్లియర్ కట్‌గా తెలిసిపోయింది. అగ్ర కులాల రాజకీయంతో బడుగు, దళిత వర్గాల జనాలు నిత్యం అణచివేతకు గురయ్యే ఓ గ్రామంలో.. ఆ రాజకీయ నాయుకలపై తిరగబడతాడు ఓ యువకుడు. ఆ తర్వాత ఏం జరగింది. ఊర్లో అల్లర్లు, గొడవలు ఏ స్థాయికి వెళ్లాయి అన్న కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. చివరకి ఆ యువకుడి పోరాటం ఎంత వరకు సాగిందన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చాలా సెన్సిటీవ్ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నాడు. ఇప్పటికే సినిమా టైటిల్‌పై విమర్శలు ఓ రేంజ్లో వెల్లవడుతున్నాయి. ఇక ట్రైలర్‌తో వాటి జోరు ఇంకా పెరిగే చాన్స్ ఉంది. మరి ఎవరి మనోభావాలను నొప్పించకుండా శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా తీశాడో లేదో తెలియాలంటే సెప్టెంబర్ 28 వరకు వేచి చూడాల్సిందే. ట్రైలర్ మొత్తం రా,రస్టిక్‌గా సాగింది. మరీ ముఖ్యంగా విజువల్స్ చాలా ఇంటెన్స్‌గా అనిపించాయి. ఊర్లో రాజకీయాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్లు చూపించాడు శ్రీకాంత్ అడ్డాల. అంతేకాకుండా ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కూడా పోషించాడు. మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రైండ్ మ్యూజిక్ ట్రైలర్‌ను ఓ హైకి తీసుకెళ్లింది.
గతంలోనూ ముకుందా సినిమాలో ఇలా రాజకీయ నేపథ్య కథను ఎంచుకున్నా.. దానిని చాలా సున్నితంగా, విమర్శలకు తావివ్వకుండా తెరకెక్కించాడు. కానీ పెదకాపు మాత్రం అలా అనిపించడం లేదు. టైటిల్ నుంచి ట్రైలర్ వరకు ప్రతీది విమర్శలకు దారి ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ఇక స్కంద, చంద్రముఖి సీక్వెల్ సినిమాలతో పోటీ పడుతున్న ఈ సినిమా ఫైనల్‌గా ఎలాంటి రిజల్ట్ రాబడుతుందో చూడాలి.