పవన్‌కల్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఏ రాజకీయ సభలో పాల్గొన్నా.. అభిమానులంతా ‘ఓజీ.. ఓజీ..’ అంటూ నినదిస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేక పవన్ అసహనానికి లోనైన సందర్భాలు కూడా ఉన్నాయి. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 90 శాతం పూర్తి చేసుకుంది. ఈ సినిమా కంటే ముందే మొదలైన ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ని ముందు ముగించి, తర్వాత ‘ఓజీ’ పని పట్టాలని పవన్ ప్లాన్ చేసుకున్నారట. అందుకే.. ముందు ‘హరిహర వీరమల్లు’ను పూర్తి చేసే పనిలో ఉన్నారాయన. నిజానికి ఈ నెల 28నే వీరమల్లు విడుదల కావాలి. కానీ షూటింగ్ ఆలస్యం వల్ల కుదర్లేదు. తాజాగా మే 9 డేట్‌ని ఖరారు చేశారు. ఇక ‘ఓజీ’ విషయానికొస్తే.. ఈ సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తవ్వగానే డేట్‌ని ప్రకటిస్తారట. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం తమన్.