మన హీరోలు పాటలు పాడటం కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా మంది కథానాయకులు తమ గాత్రంతో అభిమానులను మెప్పించారు. ఇక అగ్ర హీరో పవన్‌కల్యాణ్ గతంలో తమ్ముడు, గుడుంబా శంకర్, జానీ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వంటి చిత్రాల్లో తన గళాన్ని వినిపించి అభిమానుల్ని ఖుషీ చేశారు. తాజాగా ఆయన ‘హరి హర వీరమల్లు’ చిత్రం కోసం మరోమారు గాయకుడిగా మారనున్నట్లు తెలిసింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ మే నెల మొదటివారంలో ప్రారంభంకానుంది.
ఈ సినిమాలో ఓ స్పెషల్‌సాంగ్‌ను పవన్‌కల్యాణ్ ఆలపించనున్నారని తెలిసింది. కథాగమనంలో ఓ ప్రత్యేక సందర్భంలో వచ్చే ఈ పాటకు పవన్‌కల్యాణ్ గళం అందిస్తేనే బాగుంటుందని సంగీత దర్శకుడు కీరవాణి భావించారట. ఆయన అభ్యర్థన మేరకు పవన్‌కల్యాణ్ ఈ పాటకు అంగీకరించారని సమాచారం. త్వరలో ఈ సాంగ్ రికార్డింగ్ మొదలుపెడతారని చెబుతున్నారు. మొఘలాయిలు, కుతుబ్‌షాహీల శకం నేపథ్యంలో జరిగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అన్యాయాలపై పోరాటం చేసే బందిపోటు వీరమల్లు పాత్రలో పవన్‌కల్యాణ్ కనిపించనున్నారు. దసరాకు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.