Pawan Kalyan | ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ భారతీయ సినిమా చరిత్రలో హీరోగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనని UK లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ గుర్తింపుతో సత్కరించింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇలాంటి గౌరవం పొందిన మొట్టమొదటి నటుడిగా బాలకృష్ణ రికార్డులకెక్కాడు. ఇక ఈ అసాధారణమైన విజయాన్ని పురస్కరించుకుని ఆగస్టు 30న హైదరాబాద్‌లో ఒక భారీ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఐదు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో బాలకృష్ణ సాధించిన విజయాలను ఈ సందర్భంగా వేడుకగా జరుపుకోనున్నారు. బాలకృష్ణ అభిమానులు, చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఈ అరుదైన ఘనతపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రయాణం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. తరతరాలుగా ప్రజలచేత ఆరాధించబడిన నటుడు, సినిమా పట్ల చూపించిన అంకితభావం ఆయనని 50 సంవత్సరాల పాటు లీడ్ హీరోగా ఉండేఆ చేసింది. ఈ ప్రయాణం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక గోల్డెన్ చాప్టర్ గా నిలుస్తుంది అని అన్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు పొందడం ఆయన అసాధారణ ప్రయాణానికి నిదర్శనం అంటూ చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ఈ చరిత్రాత్మక మైలురాయిని సొంతం చేసుకున్న మన బాలయ్యకు అభినందనలు అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు చంద్రబాబు.
ఇక కొద్ది సేపటి క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. బాలనటుడిగా తెలుగు చలన చిత్ర రంగంలోకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా అడుగుపెట్టి జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్) లో చోటు సాధించిన ప్రముఖ నటులు, హిందూపురం MLA, పద్మ భూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను అని తన ఎక్స్‌లో రాసుకొచ్చారు.