సంక్రాంతి ( Sankranti ) అంటే టాలీవుడ్ ( Tollywood )కు నిజంగా పెద్ద పండగే !! ఈ సీజన్‌కు సినిమా వస్తే కలెక్షన్లు బాగా వస్తాయని ఒక టాక్ ! అది కాకుండా చాలామంది హీరోలకు సంక్రాంతి రిలీజ్ సెంటిమెంట్‌గా ఉంది. ఈ సీజన్లో వస్తే తమ సినిమా పక్కా బ్లాక్‌బస్టర్ (Blockbuster ) అవుతుందని వాళ్ల నమ్మకం ! అందుకే మన హీరోలు, నిర్మాతలు సంక్రాంతిని టార్గెట్ చేసి సినిమాలు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సారి కూడా సంక్రాంతి పండుగ కొత్త సినిమాలతో ముస్తాబవుతోంది. ఇప్పటి నుంచి స్టార్ హీరోలు బాక్సాఫీసు సమరానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ సంక్రాంతి రేసులో పోటీపడుతున్న ఆ స్టార్ హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం..
సరిలేరు నీకెవ్వరు సినిమాతో 2020 సంక్రాంతికి వచ్చిన సూపర్ స్టార్ మహేశ్‌బాబు బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. దీంతో పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న సర్కారు వారి పాట సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేస్తామని ఎప్పుడో ప్రకటించి డేట్ లాక్ చేసుకున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన మహేశ్ ఫస్ట్ లుక్ పోస్టర్లోనూ రిలీజ్ డేట్‌ను పేర్కొంది.
మహేశ్‌బాబుతో ఇప్పుడు ప్రభాస్ కూడా సంక్రాంతి సమరానికి సై అంటున్నాడు. రాధాకృష్ణకుమార్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ కూడా సంక్రాంతి బరిలో నిలిచాడు. జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అఫిషియల్‌గా ప్రకటించింది. రిలీజ్ డేట్‌తో ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. చాలా సంవత్సరాల తర్వాత సంక్రాంతి బరిలో నిలుస్తున్నాడు ప్రభాస్. ఈయనకు సంక్రాంతి పండుగ బాగానే కలిసొచ్చింది. ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ వర్షం సినిమా 2004 సంక్రాంతికి విడుదలైంది. ఆ తర్వాత 2007 యోగి కూడా అదే పండక్కి వచ్చినా అంచనాలు అందుకోలేకపోయింది. మరి రాధేశ్యామ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి..
వకీల్ సాబ్ సినిమాతో విజయం తర్వాత వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లుతో పాటు అయ్యప్పనుమ్ కోషియుమ్ మలయాళ రీమేక్‌లోనూ నటిస్తున్నాడు పవర్ స్టార్. వీటిలో హరిహర వీరమల్లు సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఆ సినిమా నిర్మాత ఏ.ఎం.రత్నం ప్రకటించారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో వస్తున్న వస్తున్న మలయాళ రీమేక్‌ను సంక్రాంతి బరిలో దించుతున్నట్లు ఇటీవల పవన్ ప్రకటించాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాలో రానా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో పోలీసు ఆఫీసర్ భీమ్లా నాయక్ పాత్రలో పవన్ కనిపించబోతున్నాడు.
2019 సంక్రాంతికి ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనే క్యాప్షన్‌తో వచ్చిన ఎఫ్2 సైలెంట్‌గా హిట్ కొట్టింది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్‌తో ఎఫ్3 కూడా సంక్రాంతి బరిలో నిలవబోతోంది. ‘ నారప్ప సినిమాను ఓటీటీలో విడుదల చేసినందుకు అభిమానులు క్షమించాలి. ఎఫ్ 3 మాత్రం థియేటర్లోనే రిలీజ్ చేస్తాం. పండుగ సీజన్లో ఫన్ పంచుతాం. అది మామూలుగా ఉండదు అని నారప్ప సక్సెస్‌మీట్‌లో వెంకటేశ్ చెప్పాడు. దీంతో సంక్రాంతికి ఎఫ్3 రాబోతుందని కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సినిమాను నిర్మిస్తున్న దిల్‌రాజుకు సంక్రాంతి బాగా కలిసొచ్చింది. తన బ్యానర్లో వచ్చిన ఎవడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు సంక్రాంతికి రిలీజై సూపర్‌హిట్‌గా నిలిచాయి. దీంతో అదే సెంటిమెంట్‌తో సంక్రాంతికే సినిమాను విడుదల చేయాలని దిల్ రాజు కూడా అనుకుంటున్నాడు.
ఎంత మంది హీరోలు పోటీపడుతున్నా.. పండగ హీరో నేనే అంటున్నారు బాలయ్య. ఈ నటసింహానికి సంక్రాంతి సక్సెస్ హిస్టరీ బాగానే ఉంది. అందుకే ఎంతమందొచ్చినా, ఎన్ని సినిమాలతో వచ్చినా.. సంక్రాంతి సినిమా నాదే అంటున్నారు. మలినేని గోపీచంద్ – బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికే ఎయిమ్ చేస్తున్నారు టీమ్.
మాస్ మహారాజా రవితేజ కూడా మరోసారి పెద్ద పండక్కి పోటీ పడుతున్నాడు. వరుస ఫ్లాపులతో సతమతవుతున్న రవితేజ గత ఏడాది క్రాక్ సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు. ఆ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన రవితేజ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. వీటిల్లో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా సంక్రాంతి బరిలో దించే ప్రయత్నాలు చేస్తున్నాడు రవితేజ.
2016 సంక్రాంతి టైమ్‌లో సోగ్గాడే చిన్ని నాయనా అంటూ వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు నాగార్జున. ఈ సినిమా ప్రీక్వెల్‌గా బంగార్రాజు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను కూడా సంక్రాంతి బరిలోనే దించుతామని వైల్డ్ డాగ్ ప్రమోషన్లో నాగార్జున చెప్పారు. ఇది కాకపోతే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్న సినిమాను అయినా పెద్ద పండక్కి రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు నాగార్జున. ఒకవేళ పరిస్థితులు అన్నీ బాగుంటే నాగార్జున కూడా ఈ సంక్రాంతి ఫైట్‌లో నిలిచే అవకాశం ఉంది.
వీళ్లే కాకుండా నాని, అఖిల్ కూడా సంక్రాంతికి తమ సినిమాలు విడుదల చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం నాని చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వీటిలో టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ సినిమాలను ఈ ఏడాదిలోనే విడుదల చేసి.. అంటే సుందరానికి సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కూడా సంక్రాంతినే నమ్ముకున్నట్లు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి, అఖిల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమాను వచ్చే ఏడాది పండుగ సీజన్లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
కొన్నేళ్లుగా సంక్రాంతి పండక్కి తెలుగు చిత్రాలతో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా విడుదల అవుతూనే ఉన్నాయి. గత ఏడాది సంక్రాంతికి కాస్త ఆలస్యంగా వచ్చి మంచి టాక్ సొంతం చేసుకున్నాడు విజయ్. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దీంతో మరోసారి సంక్రాంతి బరిలో నిలవాలని అనుకుంటున్నాడు. ఇందుకోసం తన తాజా చిత్రం బీస్ట్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక కమల్ హాసన్ నటిస్తున్న విక్రమ్ కూడా సంక్రాంతికే రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Sai Pallavi Tamil | కోలీవుడ్ కమ్‌బ్యాక్ కు సాయి పల్లవి ప్లాన్..?
కైలాస మానస సరోవర్ యాత్రకు ఉపాసన కొణిదెల ?
Samantha | అభిమానులకు షాక్.. సోషల్ మీడియాలో అక్కినేని పేరు తీసేసిన సమంత
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మూడు నెలల గ్యాప్‌లో రెండు సినిమాలు