Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్లు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి.ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తికావడంతో, ఈ సినిమాను ఎప్పుడు థియేటర్లలోకి తీసుకువస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీకి సంబంధించి ఓ క్రేజీ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే తేదీకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా కూడా విడుదల కావాల్సి ఉండటంతో, ఆ చిత్రం వాయిదా పడే అవకాశాలున్నాయి. ఒకవేళ అదే తేదీకి పవన్ కళ్యాణ్ సినిమా ఫిక్స్ అయితే, ఉస్తాద్ భగత్ సింగ్‌కు బాక్సాఫీస్ వద్ద అనుకూలమైన రిలీజ్ డేట్ దొరికినట్టేనని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్–హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు, పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్, హరీష్ శంకర్ మార్క్ డైలాగులు కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలబెడతాయనే నమ్మకం ఫ్యాన్స్‌లో గట్టిగా కనిపిస్తోంది. అధికారిక రిలీజ్ డేట్ ప్రకటన కోసం ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.