Pawan Kalyan | చాలామంది సినీ నటుల జీవితాలను చూసినప్పుడు వారు విలాసంగా ఉంటారని అనిపిస్తుంది. అయితే, అందరికీ జీవితం ఒకేలా ఉండదు. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను నవ్వించినవారే ఇప్పుడు తీరని బాధలతో జీవితం గడుపుతున్నారు. 1990లో కామెడీ పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా గుర్తుండిపోయిన నటి పాకీజా, అసెంబ్లీ రౌడీ సినిమాలో బ్రహ్మానందంతో కలసి చేసిన కామెడీ ట్రాక్ ఇప్పటికీ నవ్వులు పూయిస్తుంది. అయితే ప్రస్తుతం ఆమె తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. జీవనోపాధి లేక, ఇల్లు లేక, తినడానికి తిండి లేక జీవితం గడుపుతున్నట్లు ఆమె గతంలో ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తాజాగా, ఆమె తన ఆవేదనను మరోసారి బహిర్గతం చేస్తూ.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆదుకోవాలని వేడుకుంది. ‘‘నాకు భర్త, పిల్లలు లేరు. మూడేళ్లుగా షూటింగ్‌లు లేవు. చెన్నై నుంచి ఊరికి వచ్చేశాను. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నాను. నెల నెలా ఆసరా కోసం పెన్షన్ లాంటి సాయం కావాలి అంటూ ఆమె కంటతడి పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను చూసిన వెంటనే జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి, పాకీజాకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తరఫున ప్రభుత్వ విప్ హరిప్రసాద్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా ఆ సాయం అందించారు.
పవన్ కళ్యాణ్ సహాయం పట్ల పాకీజా భావోద్వేగానికి గురవుతూ.. ఆయన నన్ను ఆదుకున్నారు. ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను. నా కష్టం తెలిసిన వెంటనే స్పందించిన ఆయన నిజమైన నాయకుడు అంటూ కంటతడి పెట్టారు. తాను కష్టాల్లో ఉన్నానని తెలిసిన వెంటనే తక్షణం స్పందించిన పవన్ కళ్యాణ్‌కి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు.. ఆయన తనకంటే చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లకు మొక్కేదాన్ని అంటూ పాకీజా ఎమోషనల్ అయింది. తనకు సాయం చేసిన పవన్ కళ్యాణ్‌కి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఈ ఘటనపై నెటిజన్లు పవన్ కళ్యాణ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.