Pawan Kalyan | తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. మధ్యలో సినిమాలకు విరామం ఇచ్చినా, తిరిగి వెండితెర ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తన సినిమాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. తాజాగా విడుదలైన ‘ఓజీ’ చిత్రం పవన్ స్టామినాను మరోసారి నిరూపించడంతో పాటు, ఇప్పటివరకు రూ.200 కోట్ల క్లబ్‌ను కూడా దాటని ఆయనను నేరుగా రూ.300 కోట్ల క్లబ్‌లోకి చేర్చి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది. ఈ విజయంతో పవన్ చేతిలో ఉన్న ప్రాజెక్టులపై ఆసక్తి మరింతగా పెరిగింది. పవన్ కళ్యాణ్‌ను తెరపై ఎలా చూపించాలో స్పష్టమైన అవగాహన ఉన్న దర్శకుల జాబితాలో హరీష్ శంకర్ పేరు ముందుంటుంది.
ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. రీమేక్ సినిమా అయినప్పటికీ పవన్ మార్క్ మాస్ టచ్‌తో ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా వర్కౌట్ అయింది. పవన్ ఏం చేస్తే అభిమానులు ఎంజాయ్ చేస్తారో, ఏ డైలాగ్‌కు విజిల్స్ పడతాయో హరీష్ శంకర్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకుని డిజైన్ చేయగలడన్న పేరు అప్పటి నుండే ఉంది.. అందుకే ఇప్పుడు ఈ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే సినిమా ప్రారంభమైనప్పటి నుంచే కొన్ని గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇది అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించిన ‘తెరి’ సినిమాకు రీమేక్ అనే ప్రచారం అప్పుడప్పుడూ బయటకు వస్తోంది. ఈ విషయంపై దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు.
మరోవైపు దర్శకుడు దశరథ్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారన్న వార్తలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అసలు కథ ఏంటి అనే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో ఆయన పోలీస్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. సాధారణంగా పోలీస్ పాత్రలకు షార్ట్ హెయిర్ స్టైల్ ఉండగా, గతంలో ‘తెరి’ సినిమాలో విజయ్ లుక్‌ను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఇటీవలి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాల్లోనూ, దర్శకుడు సుజిత్‌కు కారు గిఫ్ట్ ఇచ్చిన సమయంలో బయటకు వచ్చిన ఫొటోలలోనూ పవన్ షార్ట్ హెయిర్ లుక్ కనిపించడంతో, ఇది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసమేనా అనే చర్చ మొదలైంది. గతంలో ‘గబ్బర్ సింగ్’, ‘భీమ్లానాయక్’ చిత్రాల్లో పోలీస్‌గా నటించినప్పుడు పవన్ ఇలాంటి హెయిర్ స్టైల్‌ను ప్రత్యేకంగా మెయింటైన్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సినిమాకోసమే లుక్ మార్చారా, లేక దీని వెనుక ఇంకేదైనా కారణం ఉందా అన్నది ఆసక్తికరంగా మారింది.