Pawan Kalyan | మరి కొద్ది నిమిషాలలో పవన్ కళ్యాన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ షోస్ జరుపుకోనుంది. దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకి విడుదలవుతుంది. థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీపై మాంచి క్రేజ్ నెలకొంది. బుధవారం నుంచి ప్రీమియర్ షోలతో సినిమా సందడి మొదలుకాబోతుంది. ఎప్పుడూ ప్రమోషన్లకు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం హరిహర వీరమల్లు చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
తాజాగా విశాఖపట్నంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ పవన్ అభిమానులకు ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఈవెంట్లో సినిమా యూనిట్‌తో పాటు రాజకీయ నాయకులు, పవన్ సన్నిహితులు కూడా హాజరయ్యారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది పవన్ కళ్యాణ్‌కు నటనలో గురువైన సత్యానంద్. ఈ కార్యక్రమంలో ఆయన చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు అక్కడున్న వారిని కదిలించాయి. సత్యానంద్ మాట్లాడుతూ..1992లో చిరంజీవి గారు నాకు ఫోన్ చేశారు. చెన్నైకి రమ్మని అన్నారు. వెళ్లిన వెంటనే పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని.. ‘ఇతడు నా తమ్ముడు, మీ చేతుల్లో పెడుతున్నాను. మీరే ఇతడిని ఆర్టిస్ట్‌గా తయారు చేయాలి’ అన్నారు. అదే నా జీవితానికి టర్నింగ్ పాయింట్ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
అప్పటికి నేను చిన్న నాటకాలు చేస్తూ బతుకుతున్నాను. చిరంజీవిగారి ఆ నిర్ణయమే నన్ను జీవితంలో నిలబెట్టింది. అదే పవన్ కెరీర్‌కు కూడా మైలురాయి అని సత్యానంద్ అన్నారు. ఇక ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ తన గురువైన సత్యానంద్‌కు సన్మానం చేసి, ఆయన పాదాలకు నమస్కరించిన దృశ్యం అభిమానులను భావోద్వేగంలోకి నెట్టింది. చిత్రానికి సంగీతమందించిన ఎంఎం కీరవాణిని కూడా పవన్ ప్రత్యేకంగా సన్మానించారు. ఒక నటుడిగా తనను తీర్చిదిద్దిన గురువుకు సన్మానం చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ మానవీయతను, వినయాన్ని మరోసారి ప్రదర్శించారు. ఇక ఈవెంట్లో ఉత్తరాంధ్ర పాటలు కూడా పాడి అలరించారు పవన్.