అగ్ర హీరో పవన్‌కల్యాణ్ వరుసగా సినిమాల్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. నాలుగేళ్లుగా నిర్మాణ దశలోనే ఉన్న ‘హరిహరవీరమల్లు’ చిత్రాన్ని ఎట్టకేలకు పూర్తి చేశారు. మరోవైపు ‘ఓజీ’ షూటింగ్లో పాల్గొంటున్నారు. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రాన్ని కూడా ఇటీవలే తిరిగి మొదలుపెట్టారు. ఈ లెక్కన ఈ సంవత్సరాంతంలో ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాలన్నీ పూర్తయిపోతాయి. దీంతో పవన్‌కల్యాణ్ తదుపరి ప్రాజెక్ట్ ఏమిటన్నది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్న.
విశ్వసనీయ సమాచారం ప్రకారం దర్శకుడు సముద్రఖని కథకు పవన్‌కల్యాణ్ అంగీకరించారని అంటున్నారు. వీరిద్దరు కలిసి ‘బ్రో’ సినిమా చేశారు. అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ సమయంలోనే సముద్రఖని డైరెక్షన్లో సినిమా చేస్తానని పవన్ మాటిచ్చారట. ఇప్పుడు దానిని పట్టాలెక్కించే పనిలో ఉన్నారని తెలుస్తున్నది. ఇటీవలే పవన్‌కల్యాణ్ కథ విన్నారని, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ పూర్తయ్యాక కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తారని ఇన్సైడ్ టాక్. మరి ఇందులో నిజానిజాలు ఏమిటో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలన్నది అభిమానులు మాట.