Pawan Kalyan Birthday | తెలుగు ప్రజల అభిమాన నటుడు, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇవాళ తన 54వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. సెప్టెంబర్ 2న జన్మించిన పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓ బ్రాండ్. అభిమానులకు తారకమంత్రం, జనసేన సైనికుల నినాదం. సినిమా రంగంలో తన ప్రత్యేక నటనతో “పవర్ స్టార్”గా పేరొందిన పవన్, ఇప్పుడు రాజకీయాల్లో “పవర్ఫుల్” నాయకుడిగా మారడం గమనార్హం. ఆయన అభిమానులు ఆయనను “పవనన్న”గా పిలుస్తే, రాజకీయ నేతలు “పవన్ సార్” అని గౌరవంతో సంభోదిస్తారు. ఇవన్నీ ఆయనపై ప్రజల ప్రేమకు, నమ్మకానికి నిదర్శనాలు.
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం 2008లో తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి అండగా నిలబడటంతో మొదలైంది. యువరాజ్య సమితి అధ్యక్షుడిగా తన మొదటి అడుగు వేసిన ఆయన, ఆ తర్వాత తన సొంత పార్టీ అయిన జనసేన ను 2014లో స్థాపించి రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తూ కీలక పాత్ర పోషించారు. ఇక 2019లో పార్టీ ఒంటరిగా పోటీ చేసి పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయింది. స్వయంగా పవన్ కల్యాణ్ రెండు చోట్లనూ ఓడిపోవడం విమర్శలకు తావిచ్చింది. కానీ తాను వెనకడుగు వేయకుండా, విమర్శలను ఎదుర్కొంటూ పార్టీని నిలబెట్టారు. 2024 ఎన్నికలు పవన్ కళ్యాణ్ కు రాజకీయ టర్నింగ్ పాయింట్‌గా నిలిచాయి.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని రూపొందించడంలో కీలకపాత్ర పోషించిన పవన్, తన సీట్లను తగ్గించుకోవాల్సి వచ్చినా కూటమిని నిలబెట్టే నిబద్ధత చూపించారు. ఈ కూటమి ఏకంగా 164 సీట్లు గెలుచుకొని వైసీపీ పాలనకు తెరదించింది. అసెంబ్లీ గేటు కూడా తాకలేరు అంటూ విమర్శించిన వారి ముందే పవన్ కళ్యాణ్ పోటీచేసిన అన్ని స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించారు. ఏకంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం ద్వారా తనకు రాజకీయాలు అచ్చిరావని విమర్శించినవారికి సమాధానం ఇచ్చారు.
ఆయన రాజకీయ జీవితంలో విమర్శలు, అవమానాలు, వ్యక్తిగత దాడులు ఉన్నాయి. అవి ఏనాడు పవన్ పట్టించుకోలేదు. ప్రజల మనోభావాలు, సమస్యలు తనవిగా భావిస్తూ రాజకీయాల్లో అడుగులు వేస్తూ వచ్చిన ఆయన, ఇప్పటికీ ప్రజల సేవనే ధ్యేయంగా కొనసాగిస్తున్నారు. ప్రత్యేకించి 2019-2024 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ పార్టీని బలోపేతం చేయడంలో చూపిన పట్టుదల అభినందనీయమైనది. పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, విదేశాల్లో ఉన్న అభిమానులూ ఘనంగా జరుపుకుంటున్నారు.
కల్యాణ్‌బాబు కూడా తన ఒరిజినల్ పేరు కాదని తల్లి అంజనాదేవి ఓ సందర్భంగా స్పష్టం చేశారు. ఆయన అసలు పేరు కల్యాణ్ కుమార్ కాగా, ఇంట్లో అతను చిన్న వాడు కావడంతో మేమంతా కల్యాణ్ బాబు అని పిలిచే వాళ్లము. సినిమాల్లోకి రాక ముందు వరకు కల్యాణ్ బాబు అని పేరు ఉండేది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన బలాన్ని ప్రదర్శించి పవన్‌గా మారినట్టు తెలియజేశారు. రెండో సినిమా నుంచే పవన్ కల్యాణ్‌గా మారిపోయారు. క్రమంగా అభిమానులకు మరింత దగ్గరై పవర్ స్టార్‌గా మారిపోయారు.