Toliprema Movie Re-Release | రీ-రిలీజ్ వల్ల ఎంత పాటి కలెక్షన్లు వస్తున్నాయో గానీ.. కొందరు థియేటర్ ఓనర్లకు మాత్రం తీవ్ర నష్టాల్ని మిగుల్చుతున్నాయి. అసలు రీ-రిలీజ్ సినిమాలు థియేటర్లో వేసుకోవాలంటేనే భయపడే స్థాయికి అభిమానులు తీసుకొస్తున్నారు. పాత సినిమాలకు 4K హంగులు దిద్దుకొని కొత్త సినిమాల రేంజ్లో ఈ మధ్య పలు సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి. మాములుగా బంపర్ హిట్లయిన పాత సినిమాలను మళ్లీ రీ-రిలీజ్ చేస్తున్నారంటే అభిమానుల్లో ఉత్సాహం కలగడం సహజమే. కానీ ఆ ఉత్సాహం మితిమీరితేనే ఇబ్బంది. కొందరు ఫ్యాన్స్ అత్యుత్సాహంతో చేసిన పనులు థియేటర్ ఓనర్లను తీవ్ర నష్టాల్ని తెచ్చిపెడుతున్నాయి.
తాజాగా పాతిక వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తొలిప్రేమ సినిమా జూన్ 30న పెద్ద ఎత్తున రీ-రిలీజ్ చేశారు. కాగా విజయవాడలోని కపర్ది థియేటర్ల హాలులో తొలిప్రేమ సినిమా ప్రదర్శితం అవుతుండగా కొందరు అభిమానులు తెరను చింపేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ తెర తాలుకూ ఖర్చు లక్షల్లోనే. ఇలా మితిమీరిన అల్లరితో పలువురు ఫ్యాన్స్ ఆయా హీరోల పేరు బ్యాడ్ చేస్తున్నారు. గతంలోనూ బిల్లా, సింహాద్రి వంటి రీ-రిలీజ్లు కూడా ఇలానే అత్యుత్సాహనికి పోయి థియేటర్ యాజమాన్యానికి తీవ్ర నష్టాలను తెచ్చిపెట్టాయి.