ఇక్కడ.. ఈలలు ఉండవ్! వన్స్మోర్లు అంతకన్నా ఉండవ్! సోడాలు కొట్టివ్వడాలు ససేమిరా కనిపించవ్!! అయితేనేం, ఈ వేదికనెక్కిన కొందరు నటులు రంగమార్తాండులు అని నిరూపించుకున్నారు. స్టార్‌హీరోలకు మించి పేరుప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు. సినిమాల్లో పెద్దగా కలిసిరాకపోయినా ఓటీటీలో ఒకట్రెండు సిరీస్‌లతో ఒక ట్రెండు సృష్టిస్తున్నారు. ఓటీటీ మేటి నటులుగా స్ట్రీమింగ్ కింగ్‌లు అవుతున్నారు.
ద ఫ్యామిలీ యాక్టర్ షరీబ్ హష్మీ
‘ద ఫ్యామిలీమ్యాన్’ వెబ్‌సిరీస్ ఎంతగా ఆదరణ పొందిందో, అందులో జేకేగా నటించిన షరీబ్ హష్మీ కూడా అంతే ఫేమస్ అయ్యాడు. అంతకు ముందు సినిమాల్లో నటించినా, ఒకట్రెండు వెబ్ సిరీస్‌లలో కనిపించినా.. ‘ద ఫ్యామిలీమ్యాన్’ మొదటి సీజన్‌తో ఓటీటీ స్టార్ అయ్యాడు. రెండో సీజన్లోనూ అదేస్థాయి నటన కనబరచి ఓటీటీ ప్రియులకు ఆరాధ్య నటుడయ్యాడు. కెరీర్ మొదట్లో స్లమ్‌డాగ్ మిలియనీర్, వోడ్కాడైరీస్, మై క్లయింట్ వైఫ్ తదితర సినిమాల్లో నటించి మెప్పించాడు. తనలోని అసలు నటుణ్ని ఓటీటీ వేదికగా పరిచయం చేశాడు. ‘1992 స్కామ్’లో కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించాడు. ‘ద గ్రేట్ ఇండియన్ మర్డర్’, ‘అసుర్’, ‘ఎ వైరల్ వెడ్డింగ్’ తదితర వెబ్‌సిరీస్‌లలోనూ మంచి పాత్రలు పోషించాడు షరీబ్ హష్మీ.
తగ్గేదే లేదు: రసికా దుగ్గల్
బాలీవుడ్ సినిమాల్లో చిన్నాచితకా వేషాలు వేసిన రసికా దుగ్గల్ ఇప్పుడు ఓటీటీలో స్టార్ నటిగా బిజీ అయిపోయింది. బోల్డ్ క్యారెక్టర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె.. తర్వాత తనదైన నటనతో అందరికీ చేరువైంది. టీవీ సీరియల్స్‌లోనూ నటించిన అనుభవం ఉండటం ఆమెకు కలిసొచ్చింది. 2018లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘మీర్జాపూర్’ వెబ్‌సిరీస్‌లో బీనా త్రిపాఠి పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. తర్వాత ‘ఢిల్లీ క్రైమ్’ వెబ్ సిరీస్‌లో నీతీసింగ్గా ఆమె కనబరచిన ప్రతిభ.. రసికాను మరో మెట్టు ఎక్కించింది. ‘ సూటబుల్ బాయ్’, ‘ఓకే కంప్యూటర్’, ‘అధూరా’ తదితర వెబ్‌సిరీస్‌లు ఆమెను నటిగా నిలబెట్టాయి. తాజాగా సినిమా ఆఫర్లూ రసికా దుగ్గల్‌ను
పలకరిస్తున్నాయి.
ఎందెందు చూసినా.. : శ్రేయా ధన్వంతరి
Shreya
స్టాక్మార్కెట్లో 90వ దశకంలో హర్షద్ మెహతా సృష్టించిన ప్రకంపనలు దలాల్‌స్ట్రీట్‌లో నేటికీ కథలు కథలుగా చెప్పుకొంటారు. ఆ కుంభకోణం నేపథ్యంలో ‘1992 స్కామ్’గా ఓటీటీకెక్కిన వెబ్‌సిరీస్‌లో శ్రేయా ధన్వంతరి కీలక పాత్ర పోషించింది. హర్షద్ మెహతా కుంభకోణాన్ని బట్టబయలు చేసిన జర్నలిస్ట్ సుచేతా దలాల్‌గా నటించింది శ్రేయ! సినిమాల్లో తన సత్తా చాటలేకపోయిన ఆమె ఓటీటీలో వచ్చిన అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంది. హైదరాబాద్‌లో పుట్టి ఢిల్లీలో పెరిగిన ఈ తెలుగమ్మాయి ‘ఫ్యామిలీమ్యాన్’ వెబ్‌సిరీస్‌తో లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ‘ఎ వైరల్ వెడ్డింగ్’ వెబ్‌సిరీస్ కూడా మంచిపేరు తెచ్చిపెట్టింది. దీనికి కథను అందించడంతోపాటు స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించింది శ్రేయ. ఇక ‘1992 స్కామ్’లో జర్నలిస్ట్‌గా ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత వచ్చిన ‘ముంబై డైరీస్ 26/11’ వెబ్‌సిరీస్‌లో కూడా జర్నలిస్ట్‌గా నటించి మెప్పించింది. తాజాగా ఆమె నటించిన ‘గన్స్ అండ్ గులాబ్స్’ ఏప్రిల్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
భలే భలే భాభా: జిమ్ సరభ్
Sarabh
సోనీలివ్‌లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతున్న వెబ్‌సిరీస్ ‘రాకెట్ బాయ్స్-2’. గతేడాది ఫిబ్రవరిలో ‘రాకెట్ బాయ్స్ 1’ విడుదలైంది. స్వతంత్ర భారతంలో తొలితరం శాస్త్రవేత్తలు విక్రమ్ సారాభాయ్, హోమీ జహంగీర్ భాభా జీవిత కథల ఆధారంగా ఓటీటీకెక్కిన ఈ సిరీస్ సంచలన విజయాన్ని అందుకుంది. ఇందులో హోమీ భాభా పాత్ర పోషించిన జిమ్ సరభ్కు ఊహించని గుర్తింపు లభించింది. హోమీ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘పద్మావత్’ సినిమాలో ఖిల్జీ చెలికాడుగా అలరించిన సరభ్ ‘రాకెట్ బాయ్స్’తో సత్తా చాటాడు. ‘సంజూ’, ‘ద వెడ్డింగ్ గెస్ట్’ సినిమాల్లోనూ ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించాడు. గత నెలలో విడుదలైన ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ చిత్రంలో న్యాయవాదిగా గుర్తుండిపోయే నటనను ప్రదర్శించాడు. ఇక ఓటీటీకి వస్తే ‘స్మోక్’, ‘మేడ్ ఇన్ హెవెన్’, ‘ఫ్లిప్’, ‘ఫోర్ మోర్ షాట్స్’ వెబ్‌సిరీస్‌లలో నటించి మెప్పించాడు. ‘రాకెట్ బాయ్స్’ సిరీస్ చూసిన ఈ తరం హోమీ భాభా గురించి తెలుసుకోవడానికి గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారంటే.. ఆ పాత్రను సరభ్ ఏ స్థాయిలో పండించాడో అర్థం చేసుకోవచ్చు..
పదింతలైన పారితోషికం: జైదీప్ అహ్లావత్
Jaideep
హరియాణాకు చెందిన జైదీప్ అహ్లావత్ పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనలో పట్టా అందుకున్నాడు. రంగస్థల అనుభవమూ ఉంది. నటుడికి కావాల్సిన ఎత్తు ఉంది. స్పష్టమైన మాటతీరూ ఉంది. అన్ని అర్హతలతో అవకాశాల కోసం ముంబయిలో అడుగుపెట్టాడు జైదీప్. ఎలాగైనా సినిమాల్లో నటించాలన్న ఆయన కల 2010లో మొదటిసారి నిజమైంది. ‘ఆక్రోశ్’ సినిమాలో ఓ పాత్ర దొరికింది. ఆ తర్వాత ఏడాది ‘చిట్టగాంగ్’ ఇలా.. ఏడాదికి ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే అవకాశం వస్తున్నా ఇండస్ట్రీని వదిలిపెట్టలేదు. కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ రెండు భాగాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించాడు. గొప్ప సినిమాలు ఎన్ని చేసినా రాని గుర్తింపు 2020లో అమెజాన్ ప్రైమ్ ‘పాతాళ్ లోక్’ వెబ్‌సిరీస్‌తో వచ్చింది. అది స్ట్రీమింగ్ మొదలైన గంటల్లోనే జైదీప్ పేరు మార్మోగింది. అదే జోరులో ‘బ్లడీ బ్రదర్స్’, ‘ద బ్రోకెన్ న్యూస్’ వెబ్‌సిరీస్‌లలోనూ అహ్లావత్ తనదైన నటన కనబరిచాడు. ‘పాతాళ్ లోక్’ తర్వాత జైదీప్ పారితోషికం ఒక్కసారిగా పదింతలు పెరిగిందట. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ఎల్లలు దాటిన పేరు జితేంద్ర కుమార్
Jitendra Kumar
ఒక యువకుడు గ్రామ కార్యదర్శిగా ఓ కుగ్రామానికి వచ్చాడు. అభివృద్ధికి నోచుకోని పల్లెను చూసి అసహనానికి గురయ్యాడు. రోజులు గడిచాయి, ఆ ఊరు అతనికి నచ్చింది. అతను మాత్రం ఆ ఊరివారికి మాత్రమే కాదు.. ఎల్లలు దాటి యావత్ ఓటీటీ ప్రేక్షకులకూ నచ్చాడు. ‘పంచాయత్’ వెబ్‌సిరీస్‌తో రెండు సీజన్లలో అభిషేక్ త్రిపాఠి పాత్రలో మెరిసిన జితేంద్ర కుమార్ ఇప్పుడు ఓటీటీ సెలెబ్రిటీ. దీనికన్నా ముందు జితేంద్ర పలు సినిమాల్లో నటించాడు. ఐదారు వెబ్‌సిరీస్‌లలోనూ కనిపించాడు. ‘పంచాయత్’తో సూపర్ హీరో అనిపించుకున్నాడు. పర్మినెంట్ రూమ్మేట్స్, టీవీఎఫ్ పిక్చర్స్, టీవీఎఫ్ బ్యాచ్లర్స్, ఇమ్మెచ్యూర్, కోటా ఫ్యాక్టరీ వంటి వెబ్‌సిరీస్‌లలో జితేంద్ర మంచి పాత్రలు పోషించాడు. గతేడాది ఆయన హీరోగా నటించిన ‘జాదూగర్’ సినిమా కూడా ఓటీటీ హిట్‌గా నిలిచింది.