అగ్ర హీరోలు భారీగా పారితోషికాలు డిమాండ్ చేయడం సినిమా విజయావకాశాలపై ప్రభావం చూపుతున్నదని తమిళ దర్శకుడు వెట్రిమారన్ అభిప్రాయపడ్డారు. రజనీకాంత్, విజయ్ వంటి అగ్ర హీరోల చిత్రాలకు ఓటీటీ సంస్థలు 120 కోట్లు చెల్లించి స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంటున్నాయని, దీనివల్ల సినీరంగంలో వ్యాపారపరమైన అంతరాలు పెరిగిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల ‘డైరెక్టర్స్ అన్‌కట్’ పేరుతో ముంబయిలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ‘అగ్ర హీరోల చిత్రాలకు 120 కోట్లు చెల్లిస్తాం అంటూ ఓటీటీ సంస్థలు తొలుత ఒత్తిడి తీసుకొస్తున్నాయి. దాంతో సినిమాల బడ్జెట్లు పెరిగిపోతున్నాయి.
ఓటీటీ మార్కెట్‌ను చూసి అగ్ర హీరోలు రెమ్యునరేషన్ కూడా పెంచుతున్నారు. ఆ తర్వాత ఓటీటీ సంస్థలు ‘మేము ఆ స్థాయిలో చెల్లించలేం’ అంటూ చేతులెత్తేస్తున్నారు. అప్పటికే హీరోలతో రెమ్యునరేషన్ అగ్రిమెంట్స్ పూర్తయి ఉండటంతో నిర్మాతలపై భారం పడుతున్నది. ఓటీటీ సంస్థలు ఈ ధోరణిని మార్చుకోవాలి’ అని వెట్రిమారన్ అన్నారు.