‘మూడునాలుగేళ్ల నుంచి విజయాలు లేకపోవడం అసంతృప్తిగా అనిపించేది. కానీ ఈ సినిమాకొస్తున్న స్పందన చూశాక నా బరువు దిగిపోయింది’ అన్నారు శర్వానంద్. ఆయన కథానాయకుడిగా శ్రీకార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. అక్కినేని అమల కీలక పాత్రను పోషించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన థాంక్స్‌మీట్‌లో శర్వానంద్ మాట్లాడుతూ ‘థియేటర్లలో సినిమా పూర్తయిన వెంటనే ప్రేక్షకులు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిసి నా మనసు ప్రశాంతంగా మారిపోయింది. ఆ చప్పట్లకు మించిన విజయం ఇంకేం ఉంటుంది? థియేటర్‌కు వెళ్లి వారి చప్పట్లు వినాలని ఉంది. దర్శకుడు శ్రీకార్తీక్ కథ చెప్పగానే సినిమా విజయం తథ్యమనే భావన కలిగింది.
తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని విడుదలకు ముందే ప్రేక్షకులకు మాటిచ్చాను. ఈ సినిమా చేస్తున్న టైమ్‌లో ఓ రోజు డిప్రెషన్లోకి వెళ్లిపోయా. అంతలా సినిమాలోని ఎమోషన్స్ నన్ను కదిలించాయి. ఆ తర్వాత కౌన్సిలింగ్ తీసుకొని షూటింగ్‌కు హాజరయ్యా’ అని చెప్పారు. అక్కినేని అమల మాట్లాడుతూ ‘సినిమాకు మంచి స్పందన లభిస్తున్నది. చూసినవారందరూ మెచ్చుకుంటున్నారు. శర్వానంద్ పరిపూర్ణమైన నటనతో మెప్పించాడు. షూటింగ్ టైమ్‌లోనే సినిమా విజయంపై నమ్మకం ఏర్పడింది. యువత భయం, దుఃఖం, ఓటమిని అధిగమించి జీవిత పథంలో ముందుకు సాగాలనే స్పూర్తిదాయకమైన అంశాల్ని అమ్మ సెంటిమెంట్ నేపథ్యంలో అందంగా ఆవిష్కరించారు’ అని తెలిపారు. సినిమాకు అన్ని ప్రాంతాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, కథతో ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారని దర్శకుడు శ్రీకార్తీక్, నిర్మాత ఎస్.ఆర్.ప్రభు ఆనందం వ్యక్తం చేశారు.