Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సెప్టెంబర్ 21వ తేదీన భారీగా నిర్వహించనున్నారు. ‘ఓజీ కాన్సర్ట్’ పేరుతో నిర్వహించే ఈ వేడుకను హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం నిర్వహిస్తున్నారు. అభిమానులు ఈ వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈవెంట్ సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం కానున్నప్పటికీ, సందడి పూర్తి స్థాయిలో ఆరు గంటల తర్వాత మొదలయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి నిర్వహించిన వేడుకలు తక్కువగా జరిగాయి.టిక్కెట్ల కొరత వలన అభిమానులు ఇబ్బంది పడ్డారు.
అందుకే ఈసారి శిల్పకళా వేదిక కాకుండా, 30 వేల మంది సామర్థ్యం గల ఎల్బీ స్టేడియంను వేదికగా ఈవెంట్‌కి ఎంచుకున్నారు. ఇప్పటికే ఈవెంట్ పాస్‌ల పంపిణీ పూర్తయ్యింది. 25 వేలకు పైగా అభిమానులు ఈ వేడుకకు హాజరవుతారని అంచనా. ఈ కార్యక్రమాన్ని శ్రేయాస్ మీడియా నిర్వహిస్తోంది. ఈ వేడుకలో స్పెషల్ హైలైట్ సంగీత దర్శకుడు తమన్ లైవ్ పెర్ఫార్మెన్స్. ఇప్పటివరకు విడుదలైన ‘ఓజీ’ సాంగ్స్ అన్నీ చార్ట్బస్టర్లు కావడంతో, స్టేజ్ పైన తాను తన బృందంతో పాటల ప్రదర్శన ఇవ్వనున్నాడు. ఇటీవల ‘ఫైర్ స్ట్రోమ్’ సాంగ్ థియేటర్లలో అభిమానుల్ని ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. అదే ఫైర్ ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో ప్రత్యక్షంగా అలరించనుంది. ఈవెంట్లో ‘ఓజీ’ ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నారు.
ముఖ్య అతిథుల విషయానికి వస్తే, ఈ వేడుకకు స్పెషల్ గెస్ట్ ఎవరన్నదిపై స్పష్టత లేదు. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఉండగా ప్రత్యేక అతిథులను ఆహ్వానించరు. చిరంజీవి వస్తారని వార్తలు వెలువడ్డా, ఆయన హాజరు అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని సమాచారం. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, జనసేన నేతలు కొందరు ఈ వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది.ఈ ఈవెంట్‌కు ‘ఓజీ’ దర్శకుడు సుజీత్, నిర్మాత డీవీవీ దానయ్య, సహ నిర్మాత కళ్యాణ్ దాస్, హీరో, హీరోయిన్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణం, సాంకేతిక బృందం హాజరవుతారు. పవన్ కళ్యాణ్, తమన్ లైవ్ షో, ట్రైలర్ రిలీజ్… ఇవన్నీ కలిపి ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ఒక పవర్ఫుల్ సెలబ్రేషన్‌కు సాక్ష్యం కానుంది.