OG Collections | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా సినిమా ‘ఓజీ (OG – Original Gangster)’ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా విడుదలైన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. స్టార్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రేక్షకుల అంచనాలను మించి తనదైన స్టైల్, పవర్ ఫుల్ యాక్షన్‌తో పవన్ కల్యాణ్ అలరించడంతో సినిమా మొదటి రోజే రూ.154 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసి, సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ అధికారికంగా , ‘ఓజీ’ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.252 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు పేర్కొంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ ప్రత్యేక పోస్టర్ని విడుదల చేసి సంతోషం వ్యక్తం చేసింది.
పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన ‘ఓజీ’ అమెరికాలో కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. $5 మిలియన్ (దాదాపు రూ.40 కోట్లు) కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఓజీ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో పవన్ కల్యాణ్ కెరీర్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. పవన్ కల్యాణ్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ లుక్, థమన్ సంగీతం, పవర్ఫుల్ బీజీఎం, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు, హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ గ్లామరస్ ప్రెజెన్స్, విలన్‌గా ఇమ్రాన్ హష్మీ పవర్ ఫుల్ రోల్ సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో ప్రముఖులు శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, అభిమన్యు సింగ్, తదితరులు తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. వెన్నెల కిశోర్, కిక్ శ్యామ్, బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ రాయగురు లాంటి వారు కూడా కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు
ప్రస్తుత టాక్, కలెక్షన్లు చూస్తుంటే పవన్ కల్యాణ్ కెరీర్లోనే ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ సినిమాగా నిలవనుందని విశ్లేషకుల అంచనా. సినిమా సక్సెస్‌తో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉండగా, చిత్ర బృందం విజయోత్సవాలకు సిద్ధమవుతోంది. ఓజీకి సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించగా , ఆ సీక్వెల్లో పవన్ కళ్యాణ్ నటిస్తారా, లేకుంటే వేరే హీరోతో మూవీని తెరకెక్కిస్తారా అన్నది చూడాలి.