తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల పట్ల సాగుతున్న వివక్ష, థియేటర్ల కేటాయింపులో ఎదురవుతున్న తీవ్ర అన్యాయంపై ‘ఓ అందాల రాక్షసీ’ చిత్ర నిర్మాత, కథానాయకుడు షిరాజ్ మెహదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో శ్రమించి, ప్రముఖ సాంకేతిక నిపుణుల భాగస్వామ్యంతో తాము ఒక అద్భుతమైన చిత్రాన్ని రూపొందిస్తే, థియేటర్లు దక్కకుండా చేస్తూ చిన్న నిర్మాతలను, దర్శకులను ఆర్థికంగా, మానసికంగా నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్యాయంపై ఇప్పటికే 40కి పైగా ప్రెస్ మీట్లు, 50కి పైగా ఇంటర్వ్యూల ద్వారా నిరసన తెలిపానని, సరైన రీతిలో థియేటర్లలో విడుదల చేస్తే తమ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తీరును ఎండగడుతూ, క్యూబ్ మరియు యుఎఫ్‌ఒ వంటి సంస్థలు సెన్సార్ నిబంధనలు, ఏడీసీసీ ప్రాసెస్ పేరుతో చిన్న నిర్మాతల నుంచి భారీ మొత్తాలను వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని మండిపడ్డారు. వారానికి రెండు వేల రూపాయలలో పూర్తయ్యే పనికి ప్రతి థియేటర్ నుంచి రూ.10 వేల నుండి రూ.12 వేల రూపాయల వరకు గుంజుతున్నారని, దీనివల్ల చిన్న నిర్మాతలు కోలుకోలేని విధంగా నష్టపోతున్నారని తెలిపారు. అలాగే ఫిల్మ్ ఛాంబర్ తీరును తీవ్రంగా తప్పుబడుతూ, చిన్న నిర్మాతలకు అండగా నిలవాల్సిన ఫిల్మ్ ఛాంబర్ వారిని నలిపేసే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మొదట థియేటర్లు ఇస్తామని చెప్పి ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన ఐనాక్స్, పివిఆర్, ఏషియన్ ఫిల్మ్స్ వంటి ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థలపై చట్టపరమైన నోటీసులు జారీ చేశామని, తెలంగాణ హైకోర్టు నుంచి వారికి సమన్లు కూడా వెళ్లాయని స్పష్టం చేశారు.
ఇండస్ట్రీలో సాగుతున్న ఈ మాఫియా పోకడలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే దృష్టి సారించి, చిన్న సినిమాలకు తగిన రక్షణ కల్పించాలని షిరాజ్ మెహదీ విజ్ఞప్తి చేశారు. సినీ పరిశ్రమలో రాత్రింబవళ్లు శ్రమించే డ్రైవర్లు, మేకప్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల సంక్షేమం కోసం ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ వంటి చర్యలు చేపట్టాలని కోరారు. తనకు ఎన్ని బెదిరింపులు వచ్చినా, ప్రాణాలు పోయినా చిన్న సినిమాల హక్కుల కోసం తన పోరాటం ఆగదని, 100 ప్రెస్ మీట్లు, భారీ ర్యాలీలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఈ ధర్మయుద్ధంలో అంతిమంగా విజయం సాధించి, త్వరలోనే ‘ఓ అందాల రాక్షసీ’ చిత్రాన్ని గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేసి తీరుతానని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు చిత్రబృందానికి పూర్తి మద్దతు తెలిపారు. హైకోర్టు అడ్వకేట్, ప్రొడ్యూసర్ ఆర్.వి. రెడ్డి మాట్లాడుతూ, సినీ పరిశ్రమలో దాదాపు 80 శాతం మాఫియా రాజ్యమేలుతోందని, గతంలో తనకు కూడా 200 థియేటర్లు ఇస్తామని చెప్పి కేవలం 60 థియేటర్లలో విడుదల చేసి రూ.10 కోట్ల వరకు నష్టం మిగిల్చారని తన చేదు అనుభవాన్ని వెల్లడించారు. మార్కెట్‌పై సరైన అవగాహన లేకుండా కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి వచ్చి నష్టపోవద్దని హితవు పలికారు. ప్రొడ్యూసర్ అహ్మద్, జబర్దస్త్ పార్థు, రిటైర్డ్ ACP లక్ష్మణ్ మరియు శైలజ మాట్లాడుతూ, ఒక చిన్న సినిమా దెబ్బతింటే దానిపై ఆధారపడిన వందలాది పేద కుటుంబాలు రోడ్డున పడతాయని, సినిమాటోగ్రఫీ మంత్రి దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.