దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ ( రౌద్రం రణం రుధిరం). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ద్వారా చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరూ వీరులను కలిపి చూపే ప్రయత్నం చేస్తున్నాడు జక్కన్న. ఇందులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్నారు.
జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకి సంబంధించి వస్తున్న వార్తలు ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఎన్టీఆర్ గొంతు సవరించుకున్నాడని అంటున్నారు. కాని చిత్ర బృందానికి సంబంధించిన కొందరు ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదంటూ కొట్టిపారేస్తున్నారు.
ఎన్టీఆర్ ఇంతకుముందు ‘యమదొంగ’, ‘కంత్రీ’, ‘అదుర్స్’, ‘రభస’, ‘నాన్నకుప్రేమతో’, పునీత్ రాజ్ కుమార్ నటించిన కన్నడ సినిమా ‘చక్రవ్యూహా’ సినిమాల్లో పాటలు పాడి సూపర్ సక్సెస్ అయ్యాయి. దీంతో జక్కన్న, కీరవాణి కలిసి ‘ఆర్ఆర్ఆర్’ లో యంగ్ టైగర్‌తో ఓ ఎనర్జిటిక్ సాంగ్ పాడించారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రూమర్‌పై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందా అనేది చూడాలి.