War 2 Telugu Version | బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ స్పై థ్రిల్లర్ చిత్రం ‘వార్ 2’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. 2019లో హృతిక్ నటించిన బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ ‘వార్’కు సీక్వెల్‌గా రాబోతుంది. హృతిక్ మరోసారి రా ఏజెంట్ మేజర్ కబీర్ ధాలివాల్ పాత్రలో కనిపించనుండగా, ఎన్టీఆర్ ఈ ఫ్రాంచైజీలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ రాబోతుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఒక ప్రత్యేకమైన ట్రీట్ లభించబోతుంది. మే 20న 42వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఎన్టీఆర్ బర్త్‌డే వేడుకలకు మరింత జోష్ నింపేందుకు వార్ 2 నుంచి క్రేజీ అప్డేట్ ఉండబోతుందని హృతిక్ రోషన్ ఎక్స్ వేదికగా వెల్లడించాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌లో ”తారక్. ఈ సంవత్సరం మే 20న ఏమి జరుగుతుందో నీకు తెలుసనుకుంటున్నావా? నన్ను నమ్ము, ఏమి దాగి ఉందో నీకు ఏ మాత్రం అసలు తెలియదు. వార్ 2 కోసం సిద్ధంగా ఉండు.” అంటూ హృతిక్ రోషన్ రాసుకోచ్చాడు. దీంతో ఈ మూవీ నుంచి టీజర్ రాబోతున్నట్లు తెలుస్తుంది.
బాలీవుడ్ సంప్రదాయానికి భిన్నంగా, యష్ రాజ్ ఫిల్మ్స్ ఈసారి ఎన్టీఆర్ పుట్టినరోజును ప్రత్యేకంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా హిందీ చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ సాధించిన విశేషమైన గుర్తింపు దీనికి కారణమని తెలుస్తోంది. ఇది మాత్రమే కాదు, ఎన్టీఆర్ అభిమానులకు మరో సర్ప్రైజ్ కూడా ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ చేస్తున్న తదుపరి చిత్రం (ప్రస్తుతానికి ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఉంది) నుంచి కూడా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా టైటిల్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఒకేసారి రెండు భారీ సినిమాల నుంచి అప్డేట్స్ వస్తే అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.
‘వార్ 2’ టీజర్లో హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు, హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ మధ్య పవర్-ప్యాక్డ్ సీక్వెన్స్‌లు ఉండవచ్చని భావిస్తున్నారు. అలాగే, సినిమా యొక్క స్పై నేపథ్యంలో సాగే కథాంశం యొక్క ఒక గ్లింప్స్‌ను కూడా టీజర్లో చూపించే అవకాశం ఉంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.