Jr.NTR and Ram Charan | ఆస్కార్ వేడుక ముగిసి రెండు రోజులవుతున్నా ఇంకా సామాజిక మాధ్యమాల్లో దీని సందడే కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత సినీ ప్రేక్షకులు 95వ ఆస్కార్ వేడుకలని అత్యధిక స్థాయిలో వీక్షించారు. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో తొలిసారి ఆస్కార్ తీసుకొచ్చిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఇక తొలిసారి భారతీయ సినిమాకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’కు ఆస్కార్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. ఇప్పట్లో దీని హడావిడి తగ్గేలా కనిపించడం లేదు. కాగా తాజాగా మన తెలుగు హీరోలు.. అదేనండి రామ్‌చరణ్, తారక్‌లు అరుదైన ఘనతను సాధించారు.
ఆస్కార్ సందర్భంగా సోషల్ మీడియాలో ఎక్కువ సార్లు ప్రస్తావించిన నటీనటుల జాబితాలో వరుసగా తొలిరెండు స్థానాల్లో మన హీరోలు నిలిచి ప్రపంచ వేదికపై చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత మూడు స్థానాల్లో హాలీవుడ్ నటులు కే హుయ్ క్వాన్, బ్రెండన్ ఫ్రేజర్, పెడ్రో పాస్కల్‌లు ఉన్నారు. ఇలా హాలీవుడ్ హీరోలను వెనక్కి నెట్టి మోస్ట్ మెన్షన్డ్ స్టార్స్‌గా తారక్, చరణ్‌లు నిలవడం విశేషమే. ఆస్కార్ వేడుకలో మన స్టార్లు ఆకర్షణగా నిలిచారు. వాళ్లు వేసుకున్న డ్రెస్‌లు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లోనూ తారక్, చరణ్‌లు టాప్-2లో ఉన్నారు.