Nora Fatehi | బాలీవుడ్ స్టార్ డ్యాన్సర్, నటి నోరా ఫతేహి మరోసారి ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఫిఫా వరల్డ్‌కప్ ముగింపు వేడుకల్లో తన అద్భుతమైన డ్యాన్స్ ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నోరా.. ఇప్పుడు ఫిఫా ప్రపంచకప్ 2026 ప్రారంభ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మెగా టోర్నీ ఓపెనింగ్ సెరెమనీకి సంబంధించిన ప్రముఖుల జాబితాను నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. అందులో నోరా ఫతేహి పేరు ఉండటంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్, గ్లోబల్ స్టేజ్‌పై మెరిసే ప్రెజెన్స్‌తో మరోసారి ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించనున్నారు.
గత ఫిఫా వరల్డ్‌కప్‌లో నోరా చేసిన ప్రదర్శనకు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ఆమె స్టేజ్ ఎనర్జీ, ఇంటర్నేషనల్ స్టైల్ ప్రెజెంటేషన్‌కు ఫుట్‌బాల్ అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పుడు మరోసారి ఆమెకు ఈ ప్రతిష్టాత్మక వేదికపై అవకాశం రావడం విశేషంగా మారింది. ఫిఫా ప్రపంచకప్ 2026 ప్రారంభ వేడుక కెనడాలోని టొరంటో నగరంలో ఘనంగా నిర్వహించనున్నారు. జూన్ 11 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ జులై 19 వరకు కొనసాగనుంది. మొత్తం 39 రోజుల పాటు జరిగే ఈ ఫుట్‌బాల్ సంబరాలకు ఈసారి మూడు దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.
కెనడా, అమెరికా, మెక్సికో కలిసి ఈ టోర్నీని నిర్వహించనున్నాయి. ఇది ఫిఫా చరిత్రలోనే అతిపెద్ద వరల్డ్‌కప్‌లలో ఒకటిగా నిలవనుంది. ఇప్పటివరకు ఫిఫా వరల్డ్‌కప్‌లో 32 దేశాలు మాత్రమే పాల్గొనగా, ఈసారి మొదటిసారి 48 దేశాలు బరిలోకి దిగనున్నాయి. దీంతో మ్యాచ్‌ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. మొత్తం మూడు దేశాల్లోని 16 వేదికల్లో 104 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ కొత్త ఫార్మాట్‌తో ప్రపంచవ్యాప్తంగా మరిన్ని దేశాలకు వరల్డ్‌కప్‌లో పాల్గొనే అవకాశం లభించడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
టోర్నీ ఫైనల్ మ్యాచ్ జులై 19న అమెరికాలోని న్యూజెర్సీ లో జరగనుంది. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో మరో అద్భుతమైన అధ్యాయంగా ఈ వరల్డ్‌కప్ నిలవనుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నోరా ఫతేహి ప్రదర్శన ఈ టోర్నీ ప్రారంభ వేడుకలకు మరింత గ్లామర్ తీసుకురానుందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ నుంచి అంతర్జాతీయ వేదిక వరకు తన ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తున్న నోరా.. ఇప్పుడు మరోసారి ఫిఫా స్టేజ్‌పై మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నారు.