Kunal Kamra | ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మరోసారి వార్తల్లో నిలిచాడు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేను ఉద్దేశించి గతంలో తాను చేసిన సెటైరికల్ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పేందుకు ఆయన నిర్మొహమాటంగా నిరాకరించారు. గురువారం నాడు మహారాష్ట్ర శాసనసభ ప్రివిలేజెస్ కమిటీ ముందు హాజరైన కమ్రా, తన వ్యాఖ్యల పట్ల తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని తేల్చి చెప్పారు. గతేడాది ఒక కామెడీ షోలో ఏకనాథ్ షిండే రాజకీయ ప్రస్థానాన్ని విమర్శిస్తూ, ఒక హిందీ సినిమా పాటను పేరడీగా వాడి కమ్రా జోక్ చేశారు. ఈ క్రమంలో షిండేను ‘గద్దర్’ (ద్రోహి) అని సంబోధించారన్న ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్సీ ప్రవీణ్ దారేకర్ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడంతో ఈ విచారణ మొదలైంది.
కమిటీ చైర్మన్ ప్రసాద్ లాడ్ నేతృత్వంలో సుమారు 24 ప్రశ్నలతో సాగిన ఈ విచారణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మీరు బేషరతుగా క్షమాపణలు చెబితే ఈ కేసును సానుకూలంగా ముగిస్తామని కమిటీ అధికారులు ప్రతిపాదించగా.. కమ్రా దాన్ని తిరస్కరించారు. మనస్ఫూర్తిగా లేని క్షమాపణలు చెప్పడం వల్ల ప్రయోజనం లేదని, అది ఇతర కళాకారుల భావప్రకటనా స్వేచ్ఛను అది దెబ్బతీస్తుందని ఆయన వాదించారు. విచారణ అనంతరం తన సోషల్ మీడియా వేదికగా స్పందించిన కమ్రా, కమిటీ అడిగిన చివరి మూడు ప్రశ్నలకు తాను ‘లేదు’ అని మాత్రమే సమాధానం చెప్పానని వెల్లడించారు. నిజాయితీ లేని క్షమాపణ చెప్పడం కంటే తన వైఖరికే కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేయడంతో, ప్రివిలేజెస్ కమిటీ ఇప్పుడు తదుపరి చర్యల కోసం నివేదికను సిద్ధం చేస్తోంది. గతంలోనే ఈ వివాదం వల్ల దాడులు, పోలీస్ కేసులు ఎదుర్కొన్న కమ్రా, ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.