సోషల్ మీడియాలో తనపై వస్తున్న పుకార్లపై తీవ్ర స్థాయిలో స్పందించింది తమిళ సోయగం నివేదా పేతురాజ్. ఓ అమ్మాయి జీవితంతో ముడిపడి ఉన్న సమాచారాన్ని పోస్ట్ చేసే ముందు కాస్త మానవత్వంతో వ్యవహరించాలని, ఆ వార్తలు ఎంత వరకు ప్రామాణికమైనవో తెలుసుకోవాలని కోరింది. ఈ మేరకు ట్విట్టర్లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టిందీ అమ్మడు. నివేదా పేతురాజ్ ఈ స్థాయిలో రియాక్ట్ కావడానికి ఓ కారణముంది.
తమిళనాడు సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఈ భామకు 50కోట్ల రూపాయల విలువైన ఇంటిని బహుమతిగా ఇచ్చాడని సోషల్ మీడియాలో పుకార్లు బయలుదేరాయి. అంతటితో ఆగకుండా సీఎం కుమారుడిని నివేదా పేతురాజ్ డబ్బుల విషయంలో బాగా వాడుకుంటుందని ఆరోపిస్తూ యూ ట్యూబ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పుకార్లపై నివేదా పేతురాజ్ ట్విట్టర్ ద్వారా స్పష్టత నిచ్చింది.
ఆ వార్తలన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది. ‘నేను చాలా గౌరవ ప్రదమైన కుటుంబం నుంచి వచ్చాను. ఆర్థికంగా మాకు ఎలాంటి లోటు లేదు. నా కుటుంబం ఇప్పటికీ దుబాయ్లో నివసిస్తున్నది. నేను కాలేజీ రోజుల నుంచే సంపాదిస్తున్నా. ఇప్పటికీ ఇరవై సినిమాలు చేశాను. ఈ ప్రయాణంలో ఏ రోజూ డబ్బు గురించి ఆశపడలేదు. ఇకపై వార్తలు రాసేముందు ఓ అమ్మాయి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని మానవత్వంతో వ్యవహరించాలని అభ్యర్థిస్తున్నా’ అని నివేదా పేతురాజ్ పేర్కొంది.