కాలుకు చిన్న గాయం కావడంతో గత కొంతకాలంగా విశ్రాంతిలో ఉన్నానని, పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉంది కాబట్ట్టే సినిమాలకు దూరంగా ఉంటున్నదనే పుకార్లు పుట్టించారని ఆవేదన వ్యక్తం చేసింది నిత్యామీనన్. ఇండస్ట్రీ తనపై నిషేధం విధించిందనే తప్పుడు ప్రచారాన్ని కూడా చేశారని ఆమె మండిపడింది. నిత్యామీనన్ మాట్లాడుతూ ‘నా పెళ్లి వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. భవిష్యత్తులో దాని గురించి ఆలోచిస్తా. నన్ను పరిశ్రమ నుంచి బ్యాన్ చేశారనే తప్పుడు వార్తల్ని పుట్టించారు. ఇలాంటి దుష్ప్రచారాన్ని నా కెరీర్ ఆరంభం నుంచి చూస్తూనే ఉన్నా. మన ఉన్నతిని ఓర్వలేని వాళ్లు ఇలాంటి వదంతులను వ్యాప్తి చేస్తారు. అనవసర విషయాల గురించి ఆలోచించే తీరిక లేదు. ప్రస్తుతం నేను మంచి కథల కోసం అన్వేషిస్తున్నా’ అని నిత్యామీనన్ చెప్పింది.