Macherla Niyokavargam Movie On OTT | నితిన్ ఒక మంచి కమర్షియల్ హిట్ కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నాడు. ‘భీష్మ’ తర్వాత ఈయన నటించిన మూడు సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేపోయాయి. ఇటీవలే ఈయన నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. సినిమాకు ముందు మంచి బజ్ ఏర్పడినా.. రొటీన్ కమర్షియల్ టెంప్లేట్ అవడంతో ప్రేక్షకులకు రుచించలేదు. ఈ చిత్రానికి ఓపెనింగ్స్ బాగానే వచ్చినా.. రెండో రోజు నుండి కనీస స్థాయిలో కూడా కలెక్షన్లు రాలేకపోయాయి. పోటీగా ‘కార్తికేయ-2’ ఉండటం కూడా ఈ సినిమాకు పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
మాచర్ల నియోజకవర్గం సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ డిజిటల్ హక్కులను దక్కించుకుంది. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 9 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. అంటే థియేటర్ విడుదలకు నెల రోజులలోపే ఈ సినిమా డిజిటల్లో విడుదలవుతుంది. ఇక ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కనిపించాడు. నితిన్‌కు జోడీగా కృతిశెట్టి, క్యాథెరీన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు. ఆదిత్య మూవీస్ &ఎంటర్టైన్మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లపై ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.