తన తండ్రి శ్యామ్ సిద్ధార్థ్ వేల మంది విద్యార్థులకు మార్గదర్శనం చేసి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారని, ప్రతి ఒక్కరి సంతోషం కోసం తపించారని హీరో నిఖిల్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన తండ్రి శ్యామ్ సిద్ధార్థ్ గురువారం అనారోగ్య కారణాలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నిఖిల్ ట్విట్టర్లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘భారమైన హృదయంతో నా తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిన విషయాన్ని మీతో పంచుకుంటున్నా.
గురువుగా ఆయన ఎందరో విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ల వీరాభిమాని అయిన నాన్న.. నన్ను వెండితెరపై చూడాలని తపించారు. ఆయన ప్రోత్సాహం వల్లే నేనీ స్థాయికి రాగలిగాను. ఒకప్పుడు జేఎన్టీయూ స్టేట్ టాపర్గా నిలిచిన నాన్న కష్టపడే తత్వాన్నే నమ్ముకున్నారు. జీవితం తాలూకు అద్భుత ఫలాల్ని అందుకునే తరుణంలోనే అరుదైన వ్యాధి బారిన పడి నిష్క్రమించారు.. గత ఎనిమిదేళ్లుగా ఆయన వ్యాధితో పోరాడారు. నాన్న..నువ్వు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా. మీ ఆలోచనలు లేనిదే ఒక్కరోజు కూడా గడవదు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో మనం చూసిన సినిమాలు, బిర్యాని కోసం వెళ్లిన రెస్టారెంట్స్, సుదూర ప్రయాణాల్లో పంచుకున్న అనుభూతులు, ముంబయి వేసవి రోజుల నాటి జ్ఞాపకాలు ఎప్పటికి మా వెంటే ఉంటాయి. నీ కొడుకునైనందుకు చాలా గర్విస్తున్నా. మళ్లీ మనం కలుసుంటామనే నమ్మకం ఉంది నాన్న’ అంటూ నిఖిల్ చేసిన పోస్ట్ ప్రతి ఒక్కరి హృదయాల్ని కదిలిస్తున్నది.