Vishal | తమిళ, తెలుగు సినీ ప్రియుల్ని తన నటనతో ఆకట్టుకున్న హీరో విశాల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. హీరోయిన్ సాయి ధన్సికతో ప్రేమలో ఉన్నట్టు కొద్ది నెలల క్రితమే బహిరంగంగా ప్రకటించిన ఆయన, తన పుట్టినరోజైన ఆగస్టు 29న పెళ్లి చేసుకోబోతున్నాని తెలిపారు. ఇటీవల ఓ ఈవెంట్‌కి హాజరైన విశాల్, తన పెళ్లి కొంత ఆలస్యం కావొచ్చని, ఆగస్టు 29న పెళ్లి కాకపోయినా రెండు కీలక ప్రకటనలు చేస్తానని వెల్లడించారు. ఈ ప్రకటనల్లో ఒకటి నడిగర్ సంఘ భవనం ప్రారంభ తేదీ, మరొకటి తన పెళ్లికి సంబంధించిన కొత్త డేట్ కావచ్చని అభిమానులు భావిస్తున్నారు. పెళ్లి కోసం తొమ్మిదేళ్లు ఆగాను… ఇంకొన్ని నెలలు ఆగలేనా? అని చమత్కారంగా వ్యాఖ్యానించిన విశాల్, తన అభిమానుల్ని మాత్రం ఇంకా సస్పెన్స్‌లోనే ఉంచారు.
అయితే విశాల్ పెళ్లి ఆలస్యం అయినా, వారి ఇంట్లో శుభకార్యం మోగింది. ఆయన మేనకోడలు ఓ విదేశీయుడిని ప్రేమించి, పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. ఈ శుభకార్యానికి విశాల్ తన కుటుంబంతో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.పట్టు పంచె, సంప్రదాయ వస్త్రధారణలో అలరిస్తూ, పెద్దల ఆశీర్వాదం తీసుకుని, వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించిన ఆయనను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు.
ఇటీవల విశాల్ ఆరోగ్యం బాగాలేదన్న వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. జనవరిలో జరిగిన ‘మదగజరాజా’ ఈవెంట్లో తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ కనీసం మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత మరో ఈవెంట్లో కళ్లుతిరిగి పడిపోవడంతో అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందారు. కొన్ని రోజులకే పూర్తిగా కోలుకుని పునరాగమనం చేసిన విశాల్, ధన్సికతో తన పెళ్లి విషయాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇప్పుడు మేనకోడలి పెళ్లిలో ఉత్సాహంగా కనిపించడంతో “విశాల్‌లో పెళ్లి కళ వచ్చింది!”, “ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు, త్వరగా పెళ్లి చేసుకోండి అన్నా!” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. విశాల్ ఎన్నో సంవత్సరాలుగా నడిగర్ సంఘ భవనం పూర్తయ్యేదాకా పెళ్లి చేసుకోను అని మాటిచ్చి నిలబడ్డారు. ఇప్పుడు ఆ భవనం పూర్తవుతుండటంతో పెళ్లికి సిద్ధమవుతున్నాడు.