Pawan Kalyan | పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా అయిదేళ్ల నిరీక్షణ తర్వాత జులై 24న థియేటర్స్‌లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే హరిహర వీరమల్లు సినిమాకు రెండు పార్టులు గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఈ సినిమా టాక్ని బట్టి పార్ట్2ని తీసుకురానున్నారు.ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తుండగా, ఎఎం. రత్నం సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, ఎఎం. జ్యోతి కృష్ణలు దర్శకత్వం వహించారు
హీరో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలలో పెద్దగా పాల్గొనడం లేదు. హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రమోషన్ కార్యక్రమాలన్నింటిని తన భుజాలపై వేసుకొని ప్రమోట్ చేస్తుంది. తాజాగా నిధి మీడియాతో మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.“ఇది నా కెరీర్లో భారీ స్థాయిలో వస్తున్న చిత్రం. ఇందులో ‘పంచమి’ అనే శక్తివంతమైన పాత్ర చేస్తున్నాను. ఈ పాత్రలో అనేక కోణాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారితో నా సన్నివేశాలు చాలా బాగా వస్తాయి. పాటల్లోనూ నా పాత్రకు సరిపోయే విధంగా వైవిధ్యం ఉంటుంది. ఈ పాత్ర కోసం వేసుకున్న ఆభరణాలు పూర్తిగా ఒరిజినల్ గోల్డ్, వాటి విలువ దాదాపు రూ. 2 కోట్లు ఉంటాయి. పాత్రకు తగిన విధంగా రెడీ కావడానికి ప్రతిసారీ రెండు గంటలు పట్టేది,” అని చెప్పింది.
ఈ సినిమాలో నేను భరతనాట్యం చేసే సీన్ ఒకటి ఉంది. అది చాలా కష్టంగా అనిపించింది. కానీ ఆ అనుభవం నాకు కొత్తగా, అద్భుతంగా అనిపించింది అని తెలిపింది. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన కెరీర్, ఫ్యాన్ బేస్, సినీ వ్యక్తిత్వం అన్నీ ఓ విశేషం. వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ గారితో చేసే ఒక్క సినిమా అంతటితో సమానం. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా ఆయనకి తెలుగు సాహిత్యం మీద ఆసక్తి చాలా ఉంది. సెట్లోనూ సాహిత్యంపై చర్చలు జరిపేవారు. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాకుండా, విజ్ఞానానికి నిలయం అని ప్రశంసించింది.
పంచమి పాత్రకు ఎంపిక చేసిన క్రిష్ నాకు స్పెషల్. కథ చెప్పినప్పుడే సినిమాకు ఓకే చెప్పేశాను. ఆ తర్వాత జ్యోతి కృష్ణ గారు టైమ్ కి బాధ్యతలు తీసుకొని సినిమాను పూర్తి చేశారు. ఇద్దరూ నా జర్నీలో ముఖ్యమైన వారు అని తెలిపింది. ఏఎం రత్నం గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయిదేళ్ల పాటు ఈ సినిమా కోసం ఎంతో ఓర్పుతో, విశ్వాసంతో నిలిచారు. అనేక ఒడిదుడుకులు ఎదురైనా వెనకడుగు వేయలేదు అని పేర్కొంది. ప్రస్తుతం నేను ప్రభాస్ తో ‘రాజాసాబ్’ సినిమాలో నటిస్తున్నాను. ఇంకా కొన్ని కథలు వినడం జరుగుతోంది. ‘హరిహర వీరమల్లు’ సినిమాకోసం ఇన్నాళ్లు ఆగాను. ఈ సినిమాకు సీక్వెల్ వస్తే, అందులోనూ నేను ఉంటాను అని తెలిపింది నిధి అగర్వాల్.