Nidhhi Agerwal | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా రూపొందిన భారీ పౌరాణిక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఏఎం రత్నం నిర్మాణంలో, క్రిష్ మరియు జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 24న గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో పవన్ అంత యాక్టివ్‌గా పాల్గొనడం లేదు. దర్శకుడు క్రిష్ మిడ్స్టేజ్లో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఆయన కూడా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. జ్యోతికృష్ణ ప్రస్తుతం ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లో ఆయనకు గుర్తింపు తక్కువగా ఉండడంతో పెద్దగా బజ్ కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో మొత్తం ప్రమోషన్ బరువు బాధ్యతలు నిధి అగర్వాల్ భుజాలపై పడింది. పంచమి పాత్రలో మెప్పిస్తున్న నిధి, గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ సినిమాపై భారీ నమ్మకంతో ఎదురుచూస్తోంది. ఈ సినిమాతో ఆమె రేంజ్ మారుతుందని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. ఇక సినిమాకి సంబంధించిన ప్రతి ప్రమోషన్ కార్యక్రమంలో నిధి యాక్టివ్‌గా పాల్గొంటుంది. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి అగర్వాల్, ‘హరి హర వీరమల్లు’తో పాటు పార్ట్ 2 గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. మొదట సినిమాను ఒకే పార్ట్‌గా రూపొందించాలనుకున్నప్పటికీ, కథ విస్తృతంగా ఉండటంతో రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించారని తెలిపింది. ఇప్పటికే పార్ట్ 2కి సంబంధించిన 20 నిమిషాల సీన్స్ షూట్ పూర్తయ్యాయని చెప్పి అభిమానులని ఆనందింపజేసింది.
నిధి చెప్పిన ప్రకారం, వీరమల్లు పార్ట్ 2లో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే, రెండో భాగం మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలియజేసింది. అయితే షూటింగ్ మిగతా భాగం ఎప్పుడవుతుందనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో పార్ట్ 1 హిట్ అయితేనే పార్ట్ 2పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.మరి ఏం జరుగుతుందో చూడాలి.